కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలుసుకున్నారు మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. సోనియా గాంధీతో కలిసి ఒక గ్రూప్ ఫొటో దిగిన సంగతి కూడా తెలిసిందే. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇంకేముంది.. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించడం లాంఛనమే, అంతా జరిగిపోయిందీ, సోనియా కూడా ఓకే చేసేశారు, అందుకే రేవంత్ కి అపాయింట్మెంట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చాక… కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల మధ్య ఇదే చర్చ తీవ్రంగా జరుగుతోందని సమాచారం. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత ఇంతవరకూ టి. నేతలు ఎవ్వరికీ సోనియా అపాయింట్మెంట్ ఇవ్వలేదనీ, నిన్నగాకమొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి తొలిసారిగా ఆమె అపాయింట్మెంట్ ఇవ్వడమేంటని కొంతమంది నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం.
పీసీసీ పగ్గాలు రేవంత్ కి ఖాయం అన్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి, ఎప్పట్నుంచో ఆశపెట్టుకున్నవారు ఇప్పుడు ఢిల్లీ బయల్దేరినట్టు తెలుస్తోంది. పీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పదవి ఆశిస్తున్న మల్లు భట్టి విక్రమార్కతో సహా కొంతమంది నాయకులు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ను కోరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనీ, తెరాస భాజపాలు రెండూ పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కి బలోపేతం చేయడం కోసం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సోనియాకి ఈ నేతలు వివరిస్తారట! ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉండాలనే అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లేందుకే వీరంతా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లు ప్రొజెక్ట్ చెయ్యాలనుకుంటున్నది ఏంటంటే… ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ కరెక్ట్ కాదనే అభిప్రాయం కలిగించడమే అని అర్థమౌతూనే ఉంది!
రేవంత్ కి పీసీసీ దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే, ఇప్పుడీ ఆశావహుల హడావుడి. నిజానికి, కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించడానికి ఇంకాస్త సమయం ఉందనే చెప్పాలి. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉంది. అది పూర్తయ్యే వరకూ ఉత్తమ్ కుమార్ ని మార్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి, సోనియాతో రేవంత్ ఫ్యామిలీ ఫొటో దిగడం… పీసీసీ పీఠం కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ కారణం అయిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.