నేను మారాను.. మీరు కూడా మారాలి అని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు హితబోధ చేయడం ప్రారంభించారు. ప్రజల్లోకి ఇంకా వెళ్లారని ఏడాది పాలనపై లోటు పాట్లు తెలుసుకునేందుకు రిపోర్టులు తెప్పించుకున్నానని .. అందులో తన పనితీరుపైనా నివేదిక ఉందని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. తెలిసి తప్పులు చేయలేదని.. తెలియకుండా తప్పులు జరిగి ఉంటే వెంటనే దిద్దుకుందామని ఆయన చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి తాను మారాను అని చెప్పడమే కాదు తొలి రోజు నుంచి చేసి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై మొదటి నుంచి ఓ విమర్శ సొంత పార్టీలో ఉంది. అదేమిటంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్ మంత్రుల్ని పెద్దగా పట్టించుకోరు అని. ఇది ఆయన దృష్టికి వెళ్లడంతో వెంటనే కవర్ చేసుకున్నారు. జనవరి ఒకటో తేదీన కేబినెట్ మంత్రులందరికీ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి కాసేపు మనసు విప్పి మాట్లాడారు. రేవంత్ తో ఎవరికీ పెద్దగా సమస్యలు లేవు. కానీ ఏదో తెలియని అడ్డుగోడ మాత్రం కొంత మందితో ఉంది.వాటిని తొలగించుకునే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి సీటులో ఉన్నంత మాత్రాన అందరూ అప్పులే చేయరు. తప్పులు కూడా చేస్తారు. కానీ చేసిన పని తప్పు అని అర్థమైనప్పుడు వెంటనే దిద్దుకోవాలి.. తాము గొప్ప పదవిలోఉన్నానని మొండిగా ముందుకెళ్లకూడదు. అలా వెళ్తే సమస్యలు పెరిగిపోతాయి.ఇప్పుడు రేవంత్ దాన్ని గుర్తించారు. అందుకే తప్పులు జరిగి ఉంటే.. దిద్దుకుంటున్నామని అంటున్నారు. ఏడాది తర్వాత రేవంత్ రెడ్డి తన పాలనపై విశ్లేషణ చేసుకున్నారు. తప్పొప్పులను దిద్దుకుని ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి కరెక్షన్స్ ఉంటే.. జర్నీ సక్సెస్ ఫుల్ అవుతుందని గతానుభవాలు చెబుతున్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి.