రేవంత్ రెడ్డి… తెలంగాణలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల లోనూ… ఆ మాటకొస్తే ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడామారుమోగుతున్న పేరు. తెలంగాణలో తనకు తిరుగులేదని అనుకుంటున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కంట్లో నలకలా, కాలిలో ముల్లులా మారుతున్న నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, వరుసగా రెండు ఎన్నికలలో అప్రతిహత విజయం సాధించి తనకు తిరుగులేదని అనుకుంటున్న కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నాయకుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక్కడే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకు పోతే కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. చివరకు సిద్ధాంతపరంగా నెరపిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం మీద గాలిలో యుద్ధం చేస్తోంది. ఈ రాజకీయ నేపథ్యంలో కేసీఆర్ ని ఢీ కొట్టగల నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కరే అని రూఢీ అయిపోయింది. తనపై కేసులు పెట్టి జైలుకు పంపించినా గాని రేవంత్ రెడ్డిలో దూకుడు తగ్గటం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సహకారం అందడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో మిగిలిన అరకొర నాయకులతో పాటు కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన నాయకులు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు పలికే అవకాశం ఉందంటున్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలాకాలంగా అసమ్మతితో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రేవంత్ రెడ్డి వైపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పట్ల అంతర్గతంగా వ్యతిరేకత ఉన్నా దానిని బహిరంగ పరిచే చేసే నాయకులు లేరని, రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెడితే ఆ లోటు భర్తీ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా పార్టీలో ఇతర నాయకులు ఆయనకు సహకరించే అవకాశం లేదని, దానికంటే సొంతంగా వేరుకుంపటి పెట్టుకోవడమే రాజకీయంగా మంచిదని విశ్లేషిస్తున్నారు.