కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఎలాగూ ఇప్పట్లో తీరేది కాదు! జాతీయ నాయకత్వమేంటో, రాహుల్ గాంధీ పాత్ర ఏంటో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇక, తెలంగాణ విషయానికొస్తే… ఇక్కడ నాయకత్వం కూడా కప్పలు తక్కెడ మేళంగా ఉంది. ఎవరి దారి వారిది అన్నట్టుగా సొంత అజెండాతో ముందుకెళ్తున్న తీరు కనిపిస్తోంది. సీనియన్లు ఒక పక్క, దాన్లో వీర విధేయులు మరోపక్క! పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు బయటకి వెళ్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సొంత పార్టీలో పరిస్థితులపై ఆలోచిస్తూ కూర్చుకునే కంటే… అధికార పార్టీపై విమర్శలకూ ఆరోపణలకీ ప్రాధాన్యత పెంచితేనే బెటర్ అనుకున్నట్టున్నారు మల్కాజ్ గిరీ ఎంపీ రేవంత్ రెడ్డి. అందుకే, ఇప్పుడు మరోసారి కేసీఆర్ సర్కారు విధానాలపై, సన్నిహితులకు చెందిన అక్రమాలపైనా విమర్శలకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. పార్లమెంటు సభ్యునిగా తనకు ఉన్న ప్రోటోకాల్ ని వినియోగించుకుంటూ అధికార పార్టీని అంశాలువారీగా ప్రశ్నించే అవకాశాల కోసం చూస్తున్నారు.
తాజాగా, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. దీన్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీకి సంబంధించిన అంశం లేవనెత్తారు. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మార్ విల్లాల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేవా అంటూ నిలదీశారు! అనుమతులు లేకపోతే వాటిని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ పట్టుబట్టారు. జీహెఎంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చడమంటే వెంటనే చర్యలకు ముందుంటారనీ, అనుమతులు లేని ఈ విల్లాలపై ఎందుకు చర్యలు తీసుకోరనీ, ఆయా సంస్థల వెనక ముఖ్యమంత్రికీ ఆయన కుమారుడికీ కావాల్సిన వారు ఉన్నారనా అంటూ గట్టిగా నిలదీశారు. దీంతో అధికారులు కాసేపు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. తాను ఫోన్ చేసినా జీహెచ్ఎంసీ అధికారులు జవాబు ఇవ్వడం లేదన్నారు. దీంతో స్పందించిన కమిషనర్ దాన కిషోర్… పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల అధికారులు అలా వ్యవహరించి ఉంటారని వెనకేసుకొచ్చారు. మొత్తానికి, రేవంత్ రెడ్డి వచ్చి వెళ్లిన తరువాతి రోజు కూడా జీహెచ్ఎంసీ అధికారుల్లో ఆయన ప్రశ్నల అంశమే ప్రధానమైన చర్చగా నిలిచిందని సమాచారం.
హైదరాబాద్ పరిధిలో సీఎం, కేటీఆర్ సన్నిహితులకు సంబంధించిన వ్యవహారాలపై మరోసారి స్పందించే పనిలో రేవంత్ ఉన్నారని సమాచారం. నటుడు నాగార్జునతో సహా కేటీఆర్ సన్నిహితులకు సంబంధించిన కొన్ని ఆస్తులూ వ్యవహారాల్లో అవకతవకల మీద గతంలో ఆధారాలతో సహా మీడియా ముందుపెట్టారు రేవంత్. ఇప్పుడు కూడా అలాంటిదే మరో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకూ పలు సంస్థల్లో ఎంపీ హోదాలో చాలా అంశాలపై ఫిర్యాదులు చేశారు రేవంత్. పార్టీ గోల పార్టీకే వదిలేసి… తన పని తాను చేయడం మొదలుపెట్టినట్టున్నారు.