తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్ కి వెళ్లనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొననున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల సీఎం రేవంత్ ను ఇటీవల ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ ఆత్మీయులు కూడా హాజరు కానున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని షర్మిల నిర్ణయించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఉదయం ఇడుపులపాయలో నివాళులు అర్పించి షర్మిల విజయవాడ రానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనియా, రాహుల్ , సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లను కూడా ఆహ్వానించారు. ఎంత మంది వస్తారో స్పష్టత లేదు కానీ..రేవంత్ రెడ్డి మాత్రం హాజరు కావాలని నిర్ణయించారు.
ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవాలంటే.. మళ్లీ వైఎస్ ఇమేజ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయంలో జగన్ నిర్లక్ష్యంగా ఉన్నారు. వైఎస్ జయంతిని పట్టించుకోవడం లేదు. దీంతో షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేతల్ని కూడా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తిరుమల పర్యటన కోసం ఏపీకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యక్రమం కోసం వస్తున్నారు. అధికారిక పర్యటన కోసం ఎప్పుడూ రాలేదు.