తెలంగాణలో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని అనుకునే ఎంపీ నియోజకవర్గం ఒకటే. అదే మెదక్. సిద్దిపేటలో వచ్చే మెజార్టీ మాత్రమే కాదు మిగిలిన నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్కు మంచి పట్టు ఉంది. ఆ నియోజకవర్గాన్ని బద్దలుకొడితే కేసీఆర్ పనైపోయినట్లేనని.. ఇప్పుడు రేవంత్ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాగైనా బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలనే లక్ష్యంతో చాపకింద నీరులా పార్టీని విస్తరింప చేస్తున్నారు. మెదక్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందరి మెజార్టీ లు కలిపితే రెండు లక్షలపైనే ఉంది. అయినా బీఆర్ఎస్ తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. అధికారంలో ఉన్నందున మెదక్ ఎంపీ సీటు గెలిచి తీరాలనే పట్టుదలతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
మెదక్ మెర్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,16,427 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచారు. గతంలోనూ కేసీఆర్, విజయశాంతి, ఆలె నరేందర్ సైతం గులాబీ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలిచారు. ఈ సారి అభ్యర్థి ఎవరో స్పష్టత లేదు. కానీ కాంగ్రెస్ మాత్రం మైనంపల్లి హనుమంతరావును దింపాలనే ఆలోచన చేస్తున్నారు. ఆయన సిద్దిపేటలో ఇప్పటికే భారీ సమావేశం నిర్వహించారు. మైనంపల్లి రోహిత్‌రావు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
హనుమంతరావు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో పట్టు సాధించేలా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన పాత వాళ్లందర్ని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. పటాన్చెరులో కాంగ్రెస్ ఓడిపోయినందున అక్కడ బలపడేందుకు ముదిరాజ్ సామాజిక తరగతిలో పట్టున్న నీలం మధును ఇటీవల కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోంది. మెదక్ సీటు కూడా ఈ సారి బీఆ్ఎస్ కు అంత ఈజీ కాదన్న వాదన ఇప్పటికే ప్రారంభమయింది.