లోక్సభ అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 5-6 సీట్లను బీసీలకు కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ నియోజకవర్గానికి కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సీట్ల సర్దుబాటు సమయంలో కేటాయించలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీ కన్నా బీసీలకు తక్కువే సీట్లు కేటాయించారు.
ఈ సారి కూడా ఎంపీ సీట్ల విషయంలో అలాంటి పరిస్థితే వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉన్నది 17 పార్లమెంట్ సీట్లు. ఇందులో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయ్యాయి. హైదరాబాద్ ముస్లింలకు అప్రకటిత రిజర్వుు నియోజకవర్గంగా ఉంది. అంటే ఇక జనరల్ కేటగిరిలో పదకొండు స్థానాలు మాత్రమే ఉంటాయి.. వీటిలో ఐదారు అయినా బీసీలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ అన్ని చోట్లా బలమైన పోటీ దారులుగా ఓసీలే ఉన్నారు.
ఖమ్మంలో రెడ్డి లేదా ఖమ్మ వర్గానికి సీటు కేటాయించాల్సిందే. సోనియా పోటీ చేస్తేనే మినహాయింపు. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, మేడ్చల్, మహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక కరీంనగర్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఖరారు చేశారని అంటున్నారు. ఇక జహీరాబాద్, నిజామాబాద్ వంటి చోట్ల మాత్రమే బీసీలకు సీట్లు కేటాయించగలరు. ఈ లెక్కన బీసీలకు ఆరేడు సీట్లు కేటాయించడం . రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సాధ్యం కాదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బలమైన నేతల కొరతే దీనికి కారణమని చెప్పే చాన్స్ ఉంది.