తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది వయసు పూర్తి చేసుకోబోతోంది. ఈ ఏడాదిలో తాము గొప్పగా పనులు చేశామని కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది తాము పది నెలల్లో చేశామని రేవంత్ రెడ్డి ఇటీవల బహిరంగసభల్లో చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ చేసినదాన్ని నాశనం చేశారని అంటున్నారు. ఎవరి వాదనలో నిజం ఉందో ప్రజలు చర్చించుకునే అవకాశం లేకుండా.. రెండు వర్గాలు తమ వాదనను బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ సర్కార్ వెనకుబడిందనే అనుకోవాలి. చేసింది చెప్పుకోవడంలో కాంగ్రెస్ వర్గాలు అనుకున్నంతగా ముందడుగు వేయలేదు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఫ్రీబస్ అమలు చేశారు. ఈ పథకం అమలు వల్ల పెద్ద ఎత్తున మహిళలకు డబ్బులు మిగులుతున్నాయి. వారిని ఎంత మేలు చేశామో… వివరించేలా చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమయింది. అదే సమయంలో రుణమాఫీ చేశారు. సాంకేతిక కారణాల వల్ల కొంత మందికి కాలేదని రేవంత్ ఒప్పుకుంటున్నారు. అలాంటి సమయంలో అలాంటి వారందరికీ ముందస్తుగా భరోసా ఇవ్వాల్సి ఉంది. అలాగేమీ చేయకుండా.. వారంతా తమకు అన్యాయం చేశారన్న భావనకు వచ్చేలా చేసుకున్నారు.
ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి మంచి పనులు చేశారు. ప్రజలపై భారం వేసే పనులేమీ చేయలేదు. చిన్న చిన్న సమస్యలతో విద్యుత్ ఒక నిమిషం పాటు ఎప్పుడైనా కట్ అయితే బీఆర్ఎస్ రేవంత్ పాలనను నిందిస్తుంది. ఇలా ప్రతి చిన్న విషయానికి తమ పాలనలో గొప్పగా ఉండేదని ఇప్పుడు రేవంత్ చెడగొట్టేశారని అంటున్నారు. నిజానికి గతంలోనూ అలాగే ఉండేది. ఇప్పుడే మెరుగ్గా ఉంది కానీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మాత్రం కాంగ్రెస్ తిప్పికొట్టలేకపోతోందని అనుకోవచ్చు. పరిశ్రమలకు భూముల సేకరణ అనేది కామన్. సీఎం సొంత నియోజకవర్గంలో దాన్ని వివాదాస్పదం చేసిన కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోయింది.
రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది మాత్రమే. ముందే గొప్ప పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకుంటే రాను రాను అది తగ్గిపోతుంది. ముందే కాస్త నెగెటివిటీ ఇమేజ్ వస్తే.. ఎలక్షన్ల దగ్గరికి వచ్చే సరికి బాగానే చేశాడన్న భావన ప్రజల్లో వస్తుంది. అలా చేసుకునే అవకాశం రేవంత్ రెడ్డికి ఉంది.