తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్ట వంతుడు ఎవరు అంటే.. అద్దంకి దయాకర్ పేరు చెప్పాలి. ఆయన కాంగ్రెస్‌కు గడ్డు కాలం ఉన్న రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టిక్కెట్ దొరకలేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ అన్నారు. అదీ రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టిక్కెట్ అన్నారు. ఆ పేరూ మారిపోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో అయినా సీటు వస్తుందనుకుంటే.. బీజేపీ నేతను చేర్చుకున్నారు.
అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1,847 ఓట్లతో, రెండవసారి 2,379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అసలు టిక్కెట్టే దక్కలేదు. అద్దంకి దయాకర్ కు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. అయినా ఆయనకు అవకాశాలు రావడం లేదు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఉపఎన్నిక వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. పైగా పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి క్షమాపణలు చెప్పారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ హిట్ లిస్ట్‌లో అద్దంకి ఉండిపోయారు.
టికెట్ ఇప్పించలేనందుకు అద్దంకి దయాకర్ కి క్షమాపణలు చెప్పినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఏ పదవి లభించడం లేదు. నల్లగొండ నేతలకు పదవి ఇవ్వాలంటే… కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అందుకే రేవంత్ కూడా పదవి ఇవ్వలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.