నిజమే, ఈ వ్యాఖ్య చేసింది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డే..! తెలంగాణ ఉద్యమ సమయంలో, సమైక్య రాష్ట్రం కోసం ఒకే ఒక్క వ్యక్తి రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నాడనీ, ఆయనే స్వర్గీయ నందమూరి హరికృష్ణ అన్నారు. ఆయన కరుడుగట్టిన సమైక్యవాది అన్నారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించాక, తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఆయన స్మారక స్థూపం కట్టడానికి వెయ్యి గజాలను కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మన రాష్ట్రం కోసం మన బిడ్డల చావులకు కారణమైన వ్యక్తికి స్మారక స్థూపం కోసం నగరంలో స్థలం ఇస్తే ఎలా ఉంటుందనీ, తాను టీడీపీ నుంచి వచ్చినా తెలంగాణ బిడ్డగా దీన్ని అడగక పోతే తన తప్పు అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, అదే సమావేశంలో పాల్గొన్న కొంతమంది తెరాస నేతల సమక్షంలోనే రేవంత్ ఇంకొన్ని విమర్శలూ చేశారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారీ, మనకు ఆద్రుల సంస్కృతి లేదనీ, సింహాద్రి నారాయణాద్రి అనేవి ఆంధ్రుల సంస్కృతి అనీ, గుట్టులు అని మాత్రమే ఇక్కడ పిల్చుకుంటామన్నారు. యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడిగా తెలంగాణతో ఏనాడూ సంబంధం లేని, ఎక్కడో గోదావరి జిల్లాలో పుట్టిన చిన జీయరుస్వామి నియమిస్తే యాదాద్రే అవుతుంది తప్ప, గుట్ట ఎలా ఉంటుందన్నారు? తెలంగాణ బద్ధవ్యతిరేకి అయిన చిన జీయరు స్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ సాష్టాంగ నమస్కారాలు పెడుతుంటే సగటు తెలంగాణ వ్యక్తిగా తనకు బాధ కలుగుతోందన్నారు. తెలంగాణ చేనేతలకు ఎక్కడి నుంచో వచ్చిన హీరోయిన్ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించారన్నారు. ఇవన్నీ ఆలోచించాలనీ, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడేం జరుగుతోందో విజ్ఞులు విశ్లేషించాలన్నారు.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై ఆలోచన చేయాలనే కాన్సెప్ట్ లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ, స్వర్గయ హరికృష్ణ స్మారక స్థూపం అంశమై రేవంత్ స్పందనను ఆంధ్రాతోపాటు, తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణులు కూడా కొంత నొచ్చుకునే అవకాశం ఉంది. రేవంత్ టీడీపీ నుంచి వెళ్లిపోయినా… ఆయనంటే ఒక సాఫ్ట్ కార్నర్ టీడీపీ అభిమానుల్లో చాలామందిలో ఉంది. ఇప్పుడీ వ్యాఖ్యను వారు ఎలా తీసుకుంటారో చూడాలి. చినజీయరు స్వామి ఆంధ్రుడు అనేది కూడా సరైంది కాదనే అనాలి! స్వాములకు కూడా రాష్ట్రాలు, ప్రాంతాలు ఆపాదించడం సరైందా..?