పేపర్ లీకేజీ కేసులో తనపై ఆరోపణలు చేసినందుకు వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు పంపిన కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి భిన్నమైన రిప్లై ఇచ్చారు. నోటీసులు వెనక్కి తసుకోకపోతే తానే క్రిమినల్ చర్యలు తీసుకుంటానన్నారు. ఎలా తీసుకుంటానో కూడా కేటీఆర్ కు ఇచ్చిన రిప్లయ్‌లో రేవంత్ వివరించారు. తాను నిరుద్యోగుల తరపున మాట్లాడానని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీకి టెక్నికల్ సపోర్ట్ మొత్తం ఐటీ శాఖ ఇస్తుందని.. అలాంటప్పుడు ఐటీ శాఖకు సంబందం లేకుండా ఎలా ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ కేసు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశామని గుర్తు చేశారు. అసలు తెలంగాణ ఉద్యమమే నియామకాల నినాదంతో ప్రారంభమయిందని.. అసలు ఉద్యమానికి కేటీఆర్‌కు సంబంధం లేదన్నారు. విదేశాల్లో గడిపి వచ్చిన కేటీఆర్‌కు తెలంగాణ నిరుద్యోగుల బాధలు తెలియవని మండిపడ్డారు. కేటీఆర్ పంపిన లేఖలో పలు అంశాలను గుర్తు చేస్తూ.. నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకంటానని రివర్స్‌లో రేవంత్ రెడ్డి హెచ్చరించడం కీలకంగా మారింది.
TSPSC పేపర్ లీక్ వ్యవహారం కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఆధారాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సిట్ కూడా నోటీసులు జారీ చేసింది. ఆయన సిట్ ఎదుట హాజరై తన వద్ద ఉన్న వివరాలు ఇచ్చారు.ఆ తర్వాత సిట్ ఆయనపై కేసు పెడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటి చర్యలు ఇంకా తీసుకోలేదు. కానీ కేటీఆర్ పరువు నష్టం దావా పేరుతో రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా వికటించినట్లుగా కనిపిస్తోంది. కేటీఆర్ తదుపరి ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.