బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలను నిలుపుకోవాలా.. కోల్పోవాలా అన్నది ఆ పార్టీ వ్యవహారశైలి మీదనే ఆధారపడి ఉంటుంది. రెండు సార్లు కాంగ్రెస్ ఎల్పీలను విలీనం చేసుకున్నా…కసి తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి అనుకోవడం లేదు. అన్ని సార్లు ఎమ్మెల్యేలను లాక్కున్నా.. కాంగ్రెస అధికారంలోకి వచ్చిందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు ఇచ్చిన బిగ్ డిబేట్ లో చెప్పారు. అందుకే వారి ఎమ్మెల్యేలను లాగేసుకోవాలన్న ఆలోచన చేయడం లేదన్నారు. కానీ ఇక్కడ ఆయన ఓ అంశం చెప్పారు.. అదేమిటంటే.. తమ ఎమ్మెల్యేలతో ఫిరాయింపులపై చర్చలు ప్రారంభిస్తే మాత్రం… సీన్ మారిపోతుందని హెచ్చరించారు.
అంటే ప్రభు్తవాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో తనకు తెలుసని రేవంత్ రెడ్డి నేరుగా చెప్పారు. పడగొట్టాలని చూస్తే..ఏం చేస్తానో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్కు పూర్తి స్థాయి సంకేతాలు వెళ్లాయని అనుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాక ముందు నుంచే పెద్ద ఎత్తున బెదిరింపులకు దిగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆరు నెలలు మాత్రమే ప్రభుత్వం ఉంటుందని వారి భావన. తెర వెనుక ఏమైనా జరుగుతున్నాయన్నట్లుగా వారి మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వీటిని ఇంకా సీరియస్గా తీసుకోలేదు.
లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రిపేరింగ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలిస్తే.. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఎవరూ చేయలేరని రేవంత్ కు తెలుసు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టే .. ఇక్కడ సమస్య వస్తోంది. దీనిపై నా రేవంత్ క్లారిటీగానే ఉన్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయంటున్నారు.