టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో రెండు పదవులు ఒకరికే కొనసాగించే సంప్రదాయం లేదు. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని మార్చే ఉద్దేశం లేదని ఆయనే చీఫ్ గా ఉంటారని సంకేతాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని భావస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హైకమాండ్ కు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
అభ్యర్థుల ఎంపికతో పాటు మొత్తం బాధ్యతలు రేవంత్ కే కట్టబెడతారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త టీ పీసీసీ చీఫ్ ను నియమిస్తే సమన్వయం కొరవడితే మొదటికే మోసం వస్తుందని రిస్క్ తీసుకోకపోవడం మంచిదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యే నేత అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో టీ పీసీసీ చీఫ్ తన పరపతిని పెంచుకంటే..వర్గపోరాటానికి సిద్ధమయితే మాత్రం.. గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.
ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇలాంటి వర్గపోరాటమే కారణం అని చెబుతున్నారు. అందుకే.. రేవంత్ రెడ్డి చాయిస్ మేరకు టీ పీసీసీ అధ్యక్షుడ్ని నియమిస్తారని అంటున్నారు. బీసీ లేదా ముస్లిం నేతను టీ పీసీసీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. మధుయాష్కీ, షబ్బీర్ అలీ వంటి వారి పేర్లను పరిశీలిస్తున్నారు.