టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని.. పోలింగ్ అంటూ ముగిసిపోతే ఇక తమ విజయాన్ని డిక్లేర్ చేయడమే మిగిలిందని ఆయన అనుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే డిబేట్ లో ఆయన మాటల్లో ఒక్క శాతం కూడా డౌట్ రాలేదు. తామే ప్రమాణస్వీకారం చేయబోతున్నామని తేల్చేశారు. ఫలితాలు తేడా వస్తే అనే పద్దతిలో ఆర్కే ఎంతగా ఆయన కాన్ఫిడెన్స్ తగ్గించే ప్రయత్నం చేసినా తగ్గలేదు.
అంతకు ముందు కేటీఆర్ ను ఆర్కే ఇలా బిగ్ డిబేట్ ద్వారా ఇంటర్యూకు పిలిచారు. కానీ కేటీఆర్ లో ఇంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు. బయట కూడా కేసీఆర్ , కేటీఆర్ ఓడిపోతే రెస్టు తీసుకుంటామని చెబుతున్నారు. అసలు ఓడిపోతే అనే మాటే ఎన్నికల సమయంలో రాకూడదు. కానీ కేసీఆర్, కేటీఆర్ నోటి వెంట వస్తోంది. దీంతో బీఆర్ఎస్ సానుభూతిపరుల్లో నెగెటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. అయితే ప్రజా వ్యతిరేకత ఉందని.. కానీ తెలంగాణకు తాము తప్ప ఎవరు వచ్చినా సమస్యలేనని చెప్పేందుకు… కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతే అని మాట్లాడి.. ఓ రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉంది.
కారణం ఏదైనా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మాత్రం.. తాము కొట్టేశామన్న నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకూ ఉన్న రాజకీయ ప్రచార సరళిని చూస్తే.. ఖచ్చితంగా ప్రతిపక్షంలోనే ఎక్కున నమ్మకం కనిపిస్తోంది.. కానీ రాజకీయ ఫలితాలు నమ్మకాల మీద ఆధారాపడి ఉండవు. ప్రజలు వేసే ఓట్లే కీలకం. కానీ ఎదురొడ్డి నిలబడి పోరాటం చేయడానికి ఈ కాన్ఫిడెన్స్ బాగా ఉపయోగపడుతుంది. తమ పార్టీకి రేవంత్ ఆ నమ్మకం, పోరాట ధైర్యం ఇస్తున్నారు.