లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేని మాట వాస్తవం. అభ్యర్థుల ఎంపిక దశలో కూడా కొంత నైరాశ్యమే ఆ పార్టీలో కనిపించింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికలు దూసుకు వచ్చేయడంతో… ఆ పార్టీకి ఊపిరి తీసుకునే అవకాశం లేదన్నట్టుగా పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి భారం నుంచి బయటపడే లోపుగానే మరో భారీ సమరానికి సిద్ధం కావాల్సి వచ్చింది. కానీ, తెరాస దూకుడు ముందు లోక్ సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని చివరికి ఆ పార్టీ రాష్ట్ర నేతలు కూడా అనుకోలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తెరాసకు దాదాపుగా అన్ని ఎంపీ సీట్లు అన్నట్టుగా లెక్కలు చెప్పాయి. అయితే, ఎట్టకేలకు ఓ నాలుగు ఎంపీ సీట్లలో తమ పట్టు నిలబెట్టుకుని… రాష్ట్రంలో కొంత నైతిక బలాన్ని సంపాదించుకుందని చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, మల్కాజ్ గిరీ ఎంపీగా దాదాపు 6 వేలకు పైచిలుకు ఓట్లతో తెరాస అభ్యర్థి రాజశేఖర్ రెడ్డిపై గెలిచారు. నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా గెలుపొందారు. దీంతో, టి. కాంగ్రెస్ పార్టీకి కొంత ఉత్సాహం రావడం ఖాయం. గెలిచిన నలుగురిలో… పార్టీ తరఫున గట్టిగా నిలబడే వాక్చాతుర్యం ఉన్నవారు ముగ్గురున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతి నుంచి కాంగ్రెస్ తరఫున బలంగా మాట్లాడే ప్రతిపక్ష నేతలే కరువైన పరిస్థితి. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష నుంచి బలమైన స్వరం ఒక్కటీ లేదా… అనే పరిస్థితి కనిపించింది. నిజానికి, ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతోపాటు, బలమైన ప్రతిపక్షం కూడా ఉన్నప్పుడే కొంత సమతౌల్యం ఉంటుంది.
ముఖ్యంగా, రేవంత్ రెడ్డి గెలుపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే, ఆయన టీడీపీలో ఉండగా బలమైన నాయకుడు. కానీ, కాంగ్రెస్ లోకి వచ్చాక అదే స్థాయిలో తన పనితీరును ప్రదర్శించే అవకాశం రేవంత్ కి ఇంతవరకూ దక్కలేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆయన మరింత నైరాశ్యంలోకి వెళ్లిన పరిస్థితి. ఇప్పుడు ఎంపీగా గెలిచారు కాబట్టి, తెలంగాణలో కాంగ్రెస్ కు ఒక బలమైన వాయిస్ ఉన్నట్టే. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఈ చిన్నపాటి విజయాన్ని… రాష్ట్రంలో పార్టీ పునర్నిర్మాణానికి వచ్చిన అవకాశంగా కాంగ్రెస్ భావిస్తే మంచిది. రేవంత్ రెడ్డి సేవల్ని మరింత సమర్థంగా వాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.