కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర పార్టీ నేతలు హడావుడిగా ఉన్నారు. రాహుల్ టూర్ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలంగాణలో ఉంటున్న సెటిలర్ల విషయమై కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సీమాంధ్రులకు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని రాహుల్ ప్రకటన చేయబోతున్నారని ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పారు. అయితే, ఇదే అంశమై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏయే సమస్యలపై ముందుగా పరిష్కరించాలనే అంశాలను దృష్టిపెట్టుకుని రాహుల్ పర్యటన ఉంటోందని రేవంత్ చెప్పారు. తెలంగాణ ప్రజలతోపాటు, తెలంగాణేతులను కూడా కాంగ్రెస్ ఒకేలా చూస్తుందన్నారు. ఇక్కడికి వచ్చి, కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటూ ఓటు హక్కు కూడా వచ్చిన తరువాత.. ఏ ప్రాంతం వారైనా ఇక్కడివారే అనేది కాంగ్రెస్ అభిప్రాయం అన్నారు. సీమాంధ్రుల సెటిలర్ల గురించి ఎప్పటికప్పుడు తెరాస చేస్తున్న వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనించాలనీ, భద్రత కల్పిస్తాం అంటుంటారన్నారు. పద్నాగేళ్లపాటు కేసీఆర్ మిమ్మల్ని అవమానించారనీ, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా గడచిన నాలుగున్నరేళ్లలో ప్రత్యేకంగా చేసిందేం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తెరాస ప్రత్యేకంగానే సెటిలర్లను చూస్తోందనీ, తమకు అలాంటి అభిప్రాయం లేదనీ, అందరూ సమానమే కాంగ్రెస్ భావిస్తోంది రేవంత్ చెప్పారు.
పద్నాలుగేళ్లుగా సెటిలర్లను కేసీఆర్ అవమానించారు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్థావిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడటం గమనార్హం! అంతేకాదు, సీఎం అయ్యాక కూడా సెటిలర్లను ప్రత్యేకంగానే చూశారనే అభిప్రాయాన్నీ ప్రచారం చేసుకునే దిశగా కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానికి, తెరాస కూడా సెటిలర్లను ఆకర్షించే ప్రయత్నాలు చాన్నాళ్ల కిందటే చేసింది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో టిక్కెట్లు కూడా సీమాంధ్రులకు ఇస్తామన్నట్టుగా సంకేతాలు ఇస్తోంది. ఈ తరహా హామీలు, సంకేతాలు తెరాస నుంచి ఇప్పటివరకూ అయితే లేవు. సెటిలర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక సెంటిమెంట్ పట్టుకుని ముందుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇలాంటి అంశాన్ని రేవంత్ రెడ్డి అయితే పక్కాగా తీసుకెళ్లగలరనడంలో సందేహం లేదు. మరి, దీనికి కౌంటర్ గా తెరాస నుంచి ఎలాంటి ప్రకటనలు ఉంటాయో చూడాలి. రాజకీయంగా కూడా సెటిలర్లకు ప్రాధాన్యత ఇస్తామనడం కొంతవరకూ కాంగ్రెస్ కు అనుకూలించే అంశం అవుతుందనే అనిపిస్తోంది.