తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి తెరాస పేరు వినగానే చిర్రెత్తుకొస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వినగానే రెచ్చిపోతారు. రేవంత్ మీడియా ముందుకు వచ్చారంటే కేసీఆర్ పై విమర్శ లేని సందర్భం అంటూ దాదాపు ఉండదనే చెప్పాలి. తెరాసను అధికారం నుంచి దించడమే జీవితాశయంగా చెబుతూ ఉంటారు. అలాంటిది తెరాసతో టీడీపీ పొత్తు అంటే ఎలా ఉంటుంది..? తెరాస నేతలతో రేవంత్ కలిసి చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది..? గతంలో ఓసారి ఇలాంటి ప్రతిపాదనే రేవంత్ ముందుకు కొంతమంది తీసుకొస్తే నిప్పులు తొక్కినట్టు చిందేశారు. ఐ.ఎస్.ఐ. తీవ్రవాద సంస్థతో చేతులు కలిపితే ఎలా ఉంటుందో… తెరాసతో పొత్తు కూడా అలాంటిదే అని అభివర్ణించారు. అయితే… ఇప్పుడు తెరాసతో కలిసి పని చేయాల్సిన ఓ సందర్భం వచ్చింది.
భద్రాచలంలో ఓ వింత రాజకీయ అనుభవం రేవంత్ రెడ్డికి ఎదురైంది. అక్కడ జరిగిన ఓ పేపరు మిల్లు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రేవంత్ వెళ్లారు. కార్మిక విభాగం టీఎన్టీయూసీకి టీడీపీ మద్దతు ఇస్తోందక్కడ. దీంతోపాటు తెరాస, వైకాపాలు కూడా ఆ విభాగానికి సపోర్ట్ చెయ్యడం విశేషం. ఈ ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేశారు. ఎలా అంటే.. రేవంత్ రెడ్డికి ఒకపక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకుడు.. మరోపక్క వైయస్సార్ సీపీ నాయకుడు ప్రచారంలో పాల్గొన్నారు. రెండు పార్టీల నేతల మధ్యా పసుపు కండువా కప్పుకుని రేవంత్ ప్రచారం చేయడం సీన్ చూసినవారంతా విచిత్రంగా ఫీలయ్యారు.
రేవంత్ రెడ్డికి కూడా ఈ అనుభవం కాస్త చిత్రంగానే అనిపించింది! కానీ, తప్పని పరిస్థితి అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆంధ్రాలో వైకాపాతో తెలుగుదేశం పోరాటం చేస్తోంది. తెలంగాణలో తెరాసతో పోరాటం. కానీ, ఈ రెండు పార్టీలతో కలిసి రేవంత్ ప్రచారం చేయాల్సి రావడం చిత్రమే కదా! ఎంతైనా, రాజకీయాలు రాజకీయాలే! శాశ్వత శత్రువులూ ఉండరూ.. శాశ్వత మిత్రులూ ఉండరు అని ఊరకే అంటారా చెప్పండీ. ప్రస్తుతం టీడీపీ, వైకాపా, తెరాసలు కలిసి ప్రచారం చేసింది ఓ చిన్న స్థాయి ఎన్నికలోనే కావొచ్చు. కానీ, రాజకీయంగా అవసరం అనేది వస్తే, అందరూ ఆ తానులో ముక్కలే అవుతారని నిరూపించున్నారు. ఆ మాటకొస్తే.. తెలంగాణలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు కదా! మొత్తానికి, భద్రాచలంలో ప్రచారం రేవంత్‌కి ఓ కొత్త అనుభవాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు.