అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణకు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకాన్ని తీసుకొచ్చింది. 2020లో ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న, మద్యతరగతి ప్రజల నుంచి మొదలుకుని రియల్టర్ల వరకు పోటీ పడ్డారు. ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.44 లక్షల మంది అప్లికేషన్లు సమర్పించారు.
కార్పొరేషన్లలో 4.13 లక్షలు, మున్సిపాలిటీల్లో 10.54 లక్షలు, పంచాయతీల్లో 10.76 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ అంశంపై పలువురు న్యాయస్థానాన్ని అశ్రయించడంతో పథకానికి బ్రేకులు పడ్డాయి. ఎల్ఆర్ఎస్ కోసం లక్షల సంఖ్యలో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారనీ, కోర్టు తుది ఉత్తర్వులొచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోమనీ, అయితే వాటిని పరిశీలించి అర్హతగల వారిని ఎంపికే చేసేందుకు అనుమతినివ్వాలని అప్పటి ప్రభుత్వంకోరింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసున్నందున క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. మొదటి దశలో దరఖాస్తుల పరిశీలన, రెండవ దశలో స్థలాల క్రమబద్ధీకరణ అర్హత గుర్తించి సిఫారసు చేయడం, మూడో దశలో సంబంధిత అధికారి నిబంధనల మేరకు ఫీజు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ ప్రక్రియ పూర్తయినప్పటికి మూడున్నరేండ్లుగా ఎలాంటి పురోగతి కన్పించలేదు. తాజాగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పథకాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు మార్చి 31లోగా లే-అవుట్లను క్రమబద్ధీకరించుకనేందుకు అవకాశం కల్పించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే-అవుట్ లను క్రమబద్ధీకరించనున్నారు. ప్రభుత్వానికి దాదాపుగా పది వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.