ఎన్నికల్లో హామీలకు ఇప్పుడు గ్యారంటీలు ఎదురొస్తున్నాయి. కర్ణాటకలో ఈ ఫార్ములాతో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు.. టీడీపీ కూడా ఏపీలో అదే చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ కూడా అేద బాటలో వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోడానికి రైతు, యూత్ డిక్లరేషన్ ప్రకటించిన టీ కాంగ్రెస్ మరో 7 డిక్లరేషన్లు ప్రకటించేందుకు సిద్దమయింది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ తన సెంటిమెంట్ నెంబర్ 9 కలిసొచ్చేలా 9 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 9 అంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఉంటుందని చెబుతున్నారు.
50 శాతం ఓటు బ్యాంకు వున్న మహిళల కోసం డిక్లరేషన్ ప్రకటించాలని రేవంత్ రెడ్డి నిర్మయించారు. అలాగే ఇతర వర్గాలకూ ప్రకటనలుఉండనున్నాయి. మొత్తం 9 డిక్లరేషన్లు కలిపి కాంగ్రెస్ మేనిఫెస్టోగా విడుదల చెయ్యడానికి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆయా డిక్లరేషన్లను రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ ప్రిపేర్ చేసే పనిలో ఉంది. 2018 ఎన్నికల్లో మేనిఫెస్టో ఆలస్యం కావడంతో పార్టీ హామీలు జనంలోకి వెళ్లక ఓడిపోయామంటున్నారు. అందుకే ఈ సారి జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. వరస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక గెలుపు కొత్త ఊపునిచ్చింది.
కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు సమన్వయంతో, సహకారంతో మంచి ఫలితాలు సాధించారు. అక్కడి నేతలు చాలా పరిపక్వతతో వ్యవహరించారు. ఎవరూ ఏకపక్ష నిర్ణయాలకు ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి కాంగ్రెస్ విజయం కోసం కష్టపడ్డారు. అందుకే కర్ణాటక ఫార్ములా తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ హామీలన్నింటినీ రాష్ట్ర నేతలతో కాకుండా రాహుల్, ప్రియాంక, సోనియాలతో ఇప్పించి గ్యారంటీ చూపించేందుకు ప్రయత్నించబోతున్నారు.