తెలంగాణలో రాజకీయం మారుతున్న కొద్దీ తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేసులో ముందున్న రేవంత్ రెడ్డికి ఆందోళన పెరుగుతోంది. తనకు ఆ పదవి దక్కనీయకుండా అందరూ కలిసి ఏమైనా చేస్తారన్న ఆందోళనలో ఆయన ఉన్నారు. ముఖ్యంగా గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఓ సందర్భంలో “ఆపరేషన్ బ్లూ స్టార్” ఉదంతాన్ని గుర్తు చేసి హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ఉదంతాన్ని పోల్చారో కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. తనను చంపడానికే కేసీఆర్ ఫిక్సయ్యారని ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించారు.
అందుకే ఆయన సెక్యూరిటీ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాక.. ఆయనకు భద్రతను పూర్తిగా తొలగించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం కేటాయించాల్సిన భద్రతను కేటాయించారు కానీ.. అది సరిపోదని రేవంత్ అనుకుంటున్నారు. అందుకే తనకు మరింత సెక్యూరిటీ కావాలని ఆయన గతంలో న్యాయస్థానాల్లో కూడా పిటిషన్లు వేశారు. చివరికి అనుకూలంగా తీర్పు కూడా తెచ్చుకోగలిగారు. కానీ అమలు చేయాల్సింది ప్రభుత్వం. అందుకే.. ఏదో కారణంతో ఆయనకు సెక్యూరిటీని తెలంగాణ సర్కార్ కల్పించడంలేదు.
దీంతో నేరుగా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్ నుంచి తనకు ప్రాణహానీ ఉందని… గతంలో కేసీఆర్ చేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ వ్యాఖ్యల్ని అమిత్ షాకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టు చెప్పినా భద్రత కల్పించడం లేదని. .. కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించాలని ఆయన కోరుతున్నారు. రేవంత్ భద్రత విషయంలో బీజేపీకి కూడా ఎలాంటి పట్టింపులు లేవు. అందుకే.. ఆయన వినతి పత్రాన్ని అమిత్ షా పట్టించుకుంటారని అనుకోవడం లేదు.