ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్న సీనియర్ అధికారిణి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టడం మాములు విషయం కాదు. ప్రభుత్వంలో భాగమని ఆ అధికారిణి భావించలేకపోయారు. వారు ప్రభుత్వంలో భాగమని చెప్పేందుకు వారి సీనియార్టీకి తగ్గట్లుగా మంచి పొజిషన్లు ఇచ్చినా మార్పులు రాలేదు. రేవంత్ అధికార వర్గాల గురించి ఎంతో అనుకుని ఉంటారు..కానీ తీరా జరుగుతోంది వేరు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అధికార వ్యవస్థను మార్చలేదు. చీఫ్ సెక్రటరీ సహా కీలక పోస్టుల్లో ఉన్న అందర్నీ కొనసాగించారు. కానీ దాని వల్ల ఏడాది తర్వాత చూసుకుంటే సమస్యలే వచ్చాయని ఆయనకు అర్థం అయింది. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు పోతోంది. అది బీఆర్ఎస్ నేతలకు చేరుతోందన్న సమాచారం ఆయనకు వచ్చింది. తన, మన అనే తేడా లేకుండా పలువురు ఐఏఎస్ లకు అవకాశాలు ఇచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోవడం లేదనే నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు. కొందరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా పనిచేయడం, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను పట్టించుకోవడంలేదు.
విధాన పరమైన నిర్ణయాలు, కీలకమైన అంశాలను గంటల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకులకు చేరుతోందని.. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటూ ప్రభుత్వ రహస్యాలు బయటకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నవారిపై వేటు వేయాలని డిసైడయ్యారు. డబ్బుల సంపాదనే ధ్యేయంగా కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు పని చేస్తున్నారని గతంలో రేవంత్ విమర్శించారు. ఇప్పటికే కొంత మందిని బదిలీ చేసిన రేవంత్.. త్వరలో కలెక్టర్ల స్థాయిలోనూ అందర్నీ మార్చేయాలని అనుకుంటున్నారు. అధికారవర్గంపై పట్టు సాధిస్తే తప్ప పాలన పై పట్టు చిక్కదని రేవంత్ అర్థం చేసుకున్నారు. మొహమాటాలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.