తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తెలుగుదేశం పార్టీ తొలిసారిగా మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని టీడీపీ వర్గాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాయి. ఓపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనల వల్ల మీడియాలో ఆశించిన స్థాయి కవరేజ్ రాలేదుగానీ.. ఓవరాల్ గా ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే, ఈ కార్యక్రమంలో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ఎంతో ప్లస్ అయిందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీలో రేవంత్ రెడ్డి స్థానమేంటో అనేది ఈ మహానాడు ద్వారా స్పష్టమైందని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
నిజానికి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి ఉంటారని ఆ మధ్య ఓ చర్చ జరిగింది. ఎన్నికలు చాలా సమయం ఉంది కాబట్టి, ఆ చర్చకు చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే, తెలుగుదేశంలో ఉంటున్న ఇతర నాయకులకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆశ ఉండటం అత్యంత సహజం! ఎందుకంటే, రేవంత్ తో సమానంగా రాజకీయానుభవం కలిగినవారు ఉండనే ఉన్నారు. అయితే, ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో రేవంత్ కు కాస్త ఇబ్బంది ఎదురైంది. తాజాగా జరిగిన మహానాడులో రేవంత్ ఫాలోయింగ్ ఏంటో అనేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అర్థమై ఉంటుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.
మహానాడు కార్యక్రమంలో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి మైక్ అందుకోగానే కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రేవంత్ ను మాట్లాడమంటూ ఆహ్వాన సూచకంగా దాదాపు ఓ రెండు నిమిషాలపాటు ప్రాంగణమంతా మార్మోగిపోయింది. దీంతో కొంతమంది టీడీపీ నేతలు అవాక్కు అయ్యారనే చెప్పాలి. వేదికపై ఉన్న చంద్రబాబు కూడా రేవంత్ కు వస్తున్న స్పందనను కాసేపు చూస్తూ ఉండిపోయారు! రేవంత్ పాపులారిటీ ఇలా ఉందన్నమాట.
అయితే, ఈ సభలో చంద్రబాబు ప్రసంగంపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ గురించిగానీ, తెరాస పాలన గురించిగానీ ఆయన ఊసెత్తకపోవడం చర్చనీయమైంది. అయితే, ఇదే సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తన సహజ శైలిలో ప్రసంగించడం కూడా ప్లస్ అయిందని చెప్పుకోవాలి. చంద్రబాబు కంటే రేవంతుడే నయం అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. సో… తెలంగాణలో జరిగిన తొలి మహానాడు రేవంత్ కి ఆ విధంగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అంతకాదు.. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మరో సూక్ష్మం ఏంటంటే… ఒకవేళ టీడీపీని రేవంత్ వదిలేసినా.. క్యాడర్ ఆయన్ని వదులుకునేది లేదనేది !