లోక్ సభ ఎన్నికల్లో చార్ సౌ పార్ నినాదం వెనక అసలు ఎజెండా రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ బీజేపీని జాతీయస్థాయిలో ఇరకాటంలోకి నెట్టిన రేవంత్ సేవలను దేశవ్యాప్తంగా వాడుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ డిసైడ్ అయింది. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే నార్త్ లో రేవంత్ తో ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేరళ, ఏపీ, కర్ణాటకలో పర్యటించిన రేవంత్.. ఈ నెల చివరి వరకూ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బహిరంగ సభలు, రోడ్ షో ల కోసం పార్టీ షెడ్యూల్ ఖరారు చేస్తోంది.
తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆయన షెడ్యూల్ పై ఇప్పటికే సీఎంవో నుంచి వివరాలను ఏఐసీసీ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన వెసులుబాటును బట్టి షెడ్యూల్ ను రూపొందించేందుకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ కసరత్తు చేస్తోంది. లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈ నెల 30న ముగుస్తుండటంతో .. తెలంగాలో ఎన్నికలు ముగిశాక రేవంత్ ఢిల్లీ, యూపీ, జార్ఖండ్, బీహార్, ఓడిశాలో ప్రచారం చేయనున్నారు.
బీజేపీకి దూకుడుగా అడ్డుకట్ట వేసేలా రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఇప్పటికే ఆయన్ను ఏఐసీసీ అభినందించింది. ఇదే దూకుడు చివరి వరకు కొనసాగించాలని సూచించింది. ఈ క్రమంలోనే రేవంత్ లేవనెత్తిన అంశాలపై ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఆయనను ప్రచార పర్వంలో భాగస్వామ్యం చేయాలనుకుంటుంది.
తెలంగాణలో ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో రేవంత్ ప్రచారంపై గాంధీ భవన్ వర్గాలు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.