ఏపీతో సత్సంబంధాలను కోరుకుంటున్నానని.. కొత్త సీఎంతో భేటీ అవుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతన్నారు. మనవడి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా దర్శనం పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏపీలో ఘర్షణ వైఖరి కోరుకోనని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన తర్వాత ఒక్క సారి కూడా ఏపీ సీఎంను కలవలేదు. కలవలేదు అనడం కన్నా కలిసేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపించలేదని అనుకోవచ్చు.
కనీసం రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు .. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా చిన్న శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి కూడా ఒకటి , రెండు సార్లు స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత .. ఏపీ వైపు నుంచి ఎలాంటి సందేశం కూడా రాలేదన్నారు. కారణం ఏదైనా రేవంత్ రెడ్డి అంటే.. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డి గౌరవం చూపించడం దీనికి కారణం కావొచ్చు.. లేదా కేసీఆర్ ను ఓడించారని.. కేసీఆర్ గెలుపు కోసం తాను చేసిన సాయం గురించి తెలిస్తే రేవంత్ కసి తీర్చుకుంటారన్న ఆందోళన కావొచ్చన్న అభిప్రాయం ఉంది.
పైగా ఇటీవల షర్మిలను ఏపీ రాజకీయాల్లో పంపడానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసే కుట్ర చేశారని కూడా ఆరోపించారు. ఈ పరిణామాలతో ఇద్దరి భేటీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడానికి కారణం.. ముఖ్యమంత్రి మారుతారన్న అభిప్రాయంతోనేనని అంటున్నారు. చంద్రబాబు సీఎం అయితే రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ కోణంలోనే రేవంత్.. కొత్త ముఖ్యమంత్రితో భేటీ గురించి వ్యాఖ్యానించినట్లుగా భావిస్తున్నారు.