అనుకున్నదే జరుగుతోంది. కాంగ్రెస్ వెనకబడిన నియోజకవర్గాల్లో రేవంత్ దూకుడుతో హస్తం మళ్లీ రేసులోకి వస్తుందన్న అంచనాలకు తగ్గటుగా ప్రచారంలో తనదైన మార్క్ వేస్తున్నారు. నిజామాబాద్, మల్కాజ్ గిరి నియోజకవర్గ సభల్లో పాల్గొన్న రేవంత్ తన ప్రసంగంతో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ లో జీవన్ రెడ్డిని గెలిపించుకునేందుకు రేవంత్ స్ట్రాటజీ ప్రకారం ప్రసంగించినట్లుగా కనబడుతోంది.
నిజామాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించండి. సోనియమ్మ, రాహుల్ గాంధీని ఒప్పించి.. జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాదంటూ రేవంత్ స్పష్టం చేశారు.ఇదే జీవన్ రెడ్డి గెలుపుకు దోహదం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2014,19లో నిజామాబాద్ లో పసుపు రైతుల మద్దతుతో ఒకసారి కవిత, మరోసారి అరవింద్ గెలిచారు. కానీ పసుపు బోర్డు విషయంలో ఇప్పటికీ బీఆర్ఎస్ , బీజేపీపై స్తానిక రైతులకు తీవ్ర అసంతృప్తి ఉంది. దాంతో పసుపు బోర్డుపై హామీ ఇచ్చినా రైతులు నమ్మరని అనుకున్నారో కానీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డిని చేసే బాధ్యత నాదని రేవంత్ తెలిపారు.
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయితే,నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ఏమంత కష్టం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకునే రేవంత్ పసుపు బోర్డుపై హామీ ఇవ్వడం కన్నా జీవన్ రెడ్డికి కేంద్రమంత్రి అనే హామీతో రైతులను ఆకట్టుకోవచ్చుననే వ్యూహంతో ఈ కామెంట్స్ చేసినట్లుగా కనబడుతోంది. మూతబడిన చక్కర కర్మాగారం కూడా సెప్టెంబర్ 17లోగా తెరిపించే బాధ్యత తమదే అంటూ రేవంత్ డెడ్ లైన్ పెట్టి మరీ హామీ ఇచ్చారు. మొత్తానికి నిజామాబాద్ లో బీజేపీ దూకుడుకు రేవంత్ ఒకే మాటతో చెక్ పెట్టేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనూ రేవంత్ ప్రసంగం ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ను ఇచ్చింది. తనకు ఎఎదురే లేకుండా ప్రచారంలో దూసుకుపోతున్న ఈటలకు రేవంత్ మూకుతాడు వేశారు. కమ్యూనిస్ట్ అని చెప్పుకునే ఈటల మతం ఎజెండాతో రాజకీయాలు చేసే వాళ్లతో చేతులేలా కలిపారని ప్రశ్నించారు. హుజురాబాద్ కి ఈటల ఎన్ని నిధులు ఇచ్చారు..? అక్కడ అభివృద్ధి చేసుంటే ఎందుకు ఓడిపోయారు.? హుజురాబాద్ ను అభివృద్ధి చేసుంటే ఇక్కడికి ఎందుకొచ్చారు.? అని ప్రశ్నించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఈటలను కొంత ఇరకాటంలోకి నెట్టేవే.
ఇలా రేవంత్ లోక్ సభ ప్రసంగాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారని..వెనకబడిన నియోజకవర్గాల్లో రేవంత్ తన మార్క్ డైలాగ్ లతో కాంగ్రెస్ ను తిరిగి రేసులోకి తీసుకొస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. రేవంత్ అనుకున్న లక్ష్యం మేరకు తెలంగాణలో 14 సీట్లు సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు.