వలస నేతలంటూ సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి వర్గం కౌంటర్ ఇస్తోంది. టీ పీసీసీ కమిటీల్లో పదవులు పొందిన 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వాటిని కాంగ్రెస్లో సీనియర్లు చెప్పిన వారికి ఇవ్వాలని సూచించారు ఇప్పటి వరకూ సీనియర్ల మాటలకు బహిరంగంగా ఎవరూ రెస్పాండ్ కాలేదు. కానీ ఈ సారి మాత్రం వారితో అటో ఇటో తేల్చుకోవాలని డిసైడయినట్లుగా ఉన్నారు. కమిటీలకు రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.
నిజానికి ఉత్తమ్ కమిటీల్లో సగం మంది టీడీపీ వాళ్లేనని ఆరోపించారు. అన్ని కమిటీల్లో తిప్పి తిప్పి చూసినా మొత్తం 13 మంది మాత్రమే టీడీపీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారు కూడా.. టీడీపీ నిస్తేజం అయిన తర్వాత తప్పనిసరిగా చేరిన వారే. రెండేళ్ల నుంచి వారు పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. కొంత మంది ఐదారేళ్ల నుంచి కష్టపడుతున్నారు. అయినప్పటికీ.. ఉన్న సంఖ్య కంటే ఎక్కువగా చెప్పి.. వలస నేతల పేరుతో రేవంత్ ను టార్గెట్ చేయడంతో ఇక కౌంటర్ ఇవ్వకపోతే బాగుండదని డిసైడయినట్లుగా తెలుస్తోంది.
రేవంత్ వర్గంలోని మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు.. వ్యూహాత్మకంగా వ్యవహరి్సతున్నారు. ఇలా పార్టీ విషయాలను బహిరంగంగా చర్చించడం కరెక్ట్ కాదని జానారెడ్డి ప్రకటించారు. మరికొంత మంది కూడా అదే మాటలు చెబుతున్నారు. దీంతో అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేసిన వారు హైకమాండ్ దృష్టిలో కూడా ఇమేజ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సీనియర్లు ఏం చేస్తారనేది కీలకంగా మారింది.