తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గీయులుగా పేరు పడిన వారందరూ… ఒక్కొక్కరుగా బీజేపీలో చేరిపోతున్నారు. మొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ .. వెళ్లి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంతు వచ్చింది. విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ తప్ప మరో మార్గం లేదు. ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండగా… ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్తో విబేధించి… రేవంత్ రెడ్డి చొరవతో కాంగ్రెస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన… ఆ తర్వాత చురుగ్గా ఉన్నప్పటికీ… కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఆయనను వెనక్కి నెట్టేశాయి.
టీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆయన… సర్కార్ పై పోరాడాలని గట్టిగా అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌లోని పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించడంలేదు. అదే విషయం చెప్పి… పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో కీలక నేత దూరమయినట్లయింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో… కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతూండటంతో నేతల్లో నిరాశా నిస్పృహలు ఏర్పడుతున్నాయి. పోరాడే నేతల్ని పట్టించుకోకుండా… వర్గ రాజకీయాలకు తలొగ్గి.. .. పార్టీని నిస్తేజం చేయడం… వారిని అసంతృప్తికి గురి చేస్తోంది.
ఓ వైపు కాంగ్రెస్ కేంద్రంగా… కుట్రలు జరుగుతున్నాయని..కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న ఓటు బ్యాంక్‌ను కూడా.. చెల్లాచెదురు చేయడానికి కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మేలుకోవడం లేదు. హైకమాండ్ చివరికి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితులో రేవంత్ పై నమ్మకం పెట్టుకున్న నేతలు కూడా.. ఒక్కొక్కరు.. వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ మేలుకుంటుందో లేదో మరి..!