వరద సాయం అంటూ… తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రూ. 400 కోట్లలో భారీ స్కామ్‌ను రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఈ నాలుగు వందల కోట్ల కేంద్రంగా.. ఆయన రాజకీయ ఆరోపణలు పోరాటం కూడా ప్రారంభించారు. తన నియోజకవర్గ పరిధిలో వరద సాయం చేసినట్లుగా అధికారులు చెబుతున్నారని ఎవరికిచ్చారని ఆయన నిలదీస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ జోనల్ మున్సిపల్ కమిషనర్లను రోజుకొకరి చొప్పున కలిసి ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలి రోజు ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయానికి వెళ్లారు. వినతి పత్రం ఇచ్చారు.
ముంపు బాధితులకు సహయం పేరుతో భారీ దోపిడీకి కుట్ర చేశారని రేవంత్ ఆరోపిస్తున్నారు. పది వేలు ఇస్తామని చెప్పి.. 5 వేలు బాధితుల నుంచి లంచాలు తీసుకున్నారని… వరద సాయం నిధుల్లో 200కోట్లు టీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఏ పథకం అయినా .. సాయం అయినా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో వేస్తారని.. కానీ ప్రభుత్వం నేరుగా ప్రజల చేతికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. దోపిడీపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకూ నాలుగు వందల కోట్లు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారని.. అంత నగదు ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్ ప్రశ్నించారు. సామాన్యుడికి రూ. లక్ష క్యాష్ ఇవ్వడానికి తిప్పలు పెట్టే బ్యాంకులు రూ. నాలుగు వందల కోట్ల నోట్లు ఎలా ఇచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద సాయం అంశం.. టీఆర్ఎస్కు కూడా ఇబ్బందికరంగానే మారింది. అందుకే తాత్కాలికంగా సాయాన్ని నిలిపివేసింది. కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ప్రారంభమయింది.