గవర్నర్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకంత వ్యతిరేకంగా ఉంటున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదు. కౌశిక్ రెడ్డి ఫైల్‌ను పెండింగ్ పెట్టినందుకేనని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఓ సారి కేసీఆర్ వెళ్లి మాట్లాడి ఉంటే తప్పని సరిగా ఆమోదించాల్సిన పరిస్థితి గవర్నర్‌కు ఉండేది. కానీ ఆ పని కేసీఆర్ చేయలేదుకానీ.. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త కారణం చెప్పారు . అదేమిటంటే.. కేటీఆర్‌ను సీఎం చేయకుండా ఉండటం కోసం కేసీఆర్ గవర్నర్‌తో లడాయి ఉన్నట్లుగా చూపిస్తున్నారట.
కేటీఆర్ తనను సీఎం చేయాలని అడుగుతున్నారని.. కానీ గవర్నర్‌తో సత్సంబంధాలు లేనందున అలా చేయడం మంచిది కాదని కేసీఆర్ చెబుతున్నారట. కుటుంబంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకునేందుకు వాటిని అధిగమించేందుకు గవర్నర్‌తో కేసీఆర్ విభేదాలు సృష్టించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. గవర్నర్ విషయంలో ఒక్క కేసీఆర్ మాత్రమేకాదు.. బీజేపీ నేతలది కూడా తప్పేనన్నారు.
గవర్నర్ రాజ్ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు కేసీఆర్ మాత్రమే కాదని… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హాజరు కాలేదని గుర్తు చేస్తున్నారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ఉండి కూడా రాలేదన్నారు. కేసీఆర్ కు కోపం వస్తుందనే వారు హాజరు కాలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు మరీ అతిశయోక్తిగా ఏమీలేవు కానీ.. అది నిజమేనని కొంత మంది భావిస్తున్నారు. కేటీఆర్ సీఎం అనే వాదన కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతనే ఉంది.