తెలుగుదేశం పార్టీనుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయిస్తే.. వారి మీద అనర్హత వేటు వేయాలంటూ స్పీకరుకు ఫిర్యాదుచేసి, ఆయన పట్టించుకోవడం లేదంటూ కోర్టుకు వెళ్లి కేసులు నడిపే బాధ్యత ఇదివరలో అయితే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీసుకునే వారు. ఇప్పుడు ఆయన కూడా ఫిరాయించేసిన తర్వాత.. ఆ పని రేవంత్‌రెడ్డి వాటాకు వచ్చినట్లుంది. తెలంగాణ అసెంబ్లీలో ఫ్లోర్‌లీడర్‌గా ఎర్రబెల్లి ఖాళీచేసిన సీటు దక్కించుకున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఫిరాయించిన వారి మీద అనర్హత వేటు వేయించేలా కోర్టును ఆశ్రయించే బాద్యత కూడా నెత్తికెత్తుకుంటున్నారు.
తెరాసలో చేరిపోయిన పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు.. తమదే అసలైన తెలుగుదేశం అని, తాము తెరాసలో విలీనం అయిపోయినట్లుగా గుర్తించాలని కోరుతూ స్పీకరు మధుసూదనాచారికి లేఖ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో.. రేవంత్‌రెడ్డి తమ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలతో టీడీఎల్పీ ఆఫీసులో మీటింగు పెట్టుకున్నారు. నిజానికి ఈ సమావేశానికి వచ్చింది నలుగురే. ఆర్.కృష్ణయ్య డుమ్మా కొట్టారు.
ఆ తర్వాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గతంలో ఇచ్చిన అయిదు ఫిర్యాదులు స్పీకరు వద్ద పెండింగులో ఉన్నాయని, ఇప్పుడు అయిదుగురిపై మళ్లీ ఫిర్యాదు ఇచ్చామని.. వీటిపై నిర్ణయం తీసుకోకుండా.. విలీనం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా.. విలీనం చేసేయడం అనేది రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదని కూడా రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. శాసనమండలిలో కూడా తెదేపా సభ్యులు తెరాసలో విలీనం అయినట్లుగా చెప్పడం కరెక్టు కాదని వాదిస్తున్నారు. ఈ విషయంలో మండలి ఛైర్మన్ తన పరిధి దాటి వ్యవహరించారని రేవంత్‌రెడ్డి అంటున్నారు. గతంలో యూపీలో ఇదే తరహాలో మండలిలో విలీనం అయినట్లు గుర్తిస్తే.. అది చెల్లదంటూ సుప్రీం కోర్టు కొట్టేసిందని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ మండలిలో జరిగిన నిర్ణయాన్ని కూడా కోర్టులో సవాలు చేస్తాం అంటున్నారు.
నిజానికి ఫిరాయింపుల నిరోధక చట్టానికి వాజపేయి హయాంలో జరిగిన మార్పుల ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ ఉన్నప్పటికీ కూడా.. విలీనం అనే ప్రక్రియ రాజ్యాంగపరంగా సాధ్యం కాదంటూ న్యాయనిపుణులు కూడా సెలవిస్తున్నారు. అయితే మరి ఫిరాయించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏ ధైర్యంతో శుక్రవారం ఉదయం లేఖ ఇచ్చారో తేలడం లేదు.