తెలంగాణ డ్రగ్స్ కేసుల్లో రేవంత్ రెడ్డి పట్టు వదలకుండా కోర్టుల ద్వారా పోరాడుతూనే ఉన్నారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి ఇంకా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఫలితంగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగుతోంది. తెలంగాణ ప్రభుత్వం సాక్ష్యాలివ్వడానికి ఇబ్బంది పెడుతున్నా.. ఈడీ కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లు వేసి మరీ తన ప్రయత్నం తాను చేస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి మరో డ్రగ్స్ కేసుపై హైకోర్టు తలుపు తట్టారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు అందర్నీ వదిలి పెట్టారని.. ఆ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఉగాది రోజున రాత్రి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఉన్న పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసులు దాడి చేసి 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారందర్నీ ఇళ్లకు పంపేశారు. అప్పుడు పెద్ద ఎత్తున అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతోందని పోలీసులు ఇచ్చిన సమాచారంలో మీడియాలో విస్తృత కథనాలు వచ్చాయి. తర్వాత మొత్తం తేలిపోయింది. నలుగురిపై కేసు పెట్టి ఇద్దర్ని అరెస్ట్ చేసి.. వారిని కస్టడీకి తీసుకుని.. కస్టడీ రిపోర్టులో అసలు డ్రగ్స్ ఆనవాళ్లే లేవని కోర్టుకు చెప్పారు. దీంతో కేసు తేలిపోయినట్లయింది.
అయితే ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు ఉన్నారని.. వారిని రక్షించేందుకు అసలు డ్రగ్స్ లేవన్నట్లుగా చెబుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ హైకోర్టుకు వెళ్లారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని లేలేకపోతే ఉమ్మడి దర్యాప్తు అయినా చేయించాలని ఆయన కోరుతున్నారు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల విషయంలో రేవంత్ రెడ్డి ఏళ్ల తరబడి పోరాటం చేస్తునే ఉన్నారు.