జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు మూడు లక్షల వరకూ ప్రభుత్వానికి కట్టారు. ఇలాంటి వారు పదకొండు వందల మంది ఉన్నారు. డబ్బులు కట్టిన తర్వాత వివాదాల్లో ఉన్న భూమిని అప్పటి సీఎం వైఎస్ కేటాయించారు. అవి కోర్టు కేసుల్లో పడ్డాయి. చివరికి సుప్రీంకోర్టు క్లియర్ చేసినా కేసీఆర్ స్థలాలిచ్చేందుకు ముందుకు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏమీ మనసులో పెట్టుకోకుండా ఆ స్థలం జర్నలిస్టుల సొసైటీకి హ్యండోవర్ చేశారు.
17 ఏళ్ల కిందట పేట్ బషీరాబాద్ లో స్థలం కేటాయించారు. కానీ అప్పట్లో అది ఊరికి దూరంగా ఉంది. విలువ తక్కువ. కానీ ఇప్పుడు ఆ స్థలం అత్యంత ఖరీదైనది. ఇప్పుడు ఆ స్థలం కాకుండా ఊరవతల తీసుకోండి అని కూడా రేవంత్ అనకుడా అదే స్థలం కేటాయింపులు చేశారు. ఈ మేరుక రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పత్రాలు అందచేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శషభిషలు లేవని.. మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని ప్రకటించారు.
ఈ సందర్భంగా కొంత మంది జర్నలిస్టుల తీరుపై రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని.. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారన్నారు భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి… ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సలహా ఇచ్చారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నానన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నానని ప్రకటించారు.
ఇప్పుడు హ్యాండోవర్ చేసిన స్థలం 17 ఏళ్ల కిందటిది.. ఆ తర్వాత మీడియాలో ఓ రకమైన విప్లవం వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేసినా అది తలకు మించిన భారం అవుతుంది. అయినా రేవంత్ మాత్రం.. కొత్తగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.