లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. కీలకమైన మల్కాజిగిరి నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బరిలో ఉంటారు. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, ఆదిలాబాద్ టికెట్‌ను మాజీ ఎంపీ రమేష్రాధోడ్కు కేటాయించారు. హరీష్ రావు అనుచరుడిగా పేరున్న టీఆర్ఎస్ నేత, గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో చేరిన గాలి అనిల్‌కుమార్‌కు మెదక్ నుంచి అవకాశం కల్పించించారు. జహీరాబాద్ లోక్‌సభ స్ధానానికి పార్టీ నేత మదన్మోహన్రావును ఎంపిక చేశారు. ఈయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు.
టీఆర్ఎస్లోనూ.. టిక్కెట్ల కసరత్తు జరుగుతోంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్ ఖరారు చేశారు. ఎంపీలు వినోద్ కమార్, కవిత, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, గోడం నగేష్, పసునూరి దయాకర్ లకు ప్రగతి భవన్ నుంచి పనిచేసుకోవాలని సమాచారం అందింది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలు లేవని నేరుగానే చెబుతున్నారు. మార్చాలనుకున్న ముగ్గురు అభ్యర్థులతో పాటు సిట్టింగులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి లు టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దం కావడంతో చేవెళ్ల ఎంపీ టిక్కెట్ పై సందిగ్ధత నెలకొంది.
ఇప్పటికే గడ్డం రంజిత్ రెడ్డి కే టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతూంటే ….కార్తీక్ రెడ్డి తెరమీదకి రావడంతో ఈ ఇద్దరిలో ఎవరికి దక్కవచ్చన్న చర్చ ఇప్పడు జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఒక పక్క నవీన్ రావు, మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి లు టిక్కెట్ ఆశిస్తున్నారు. నాగర్ కర్నూల్ పి.రాములు, మహబూబాబాద్ లో మాలోతు కవిత, ఖమ్మంలో వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, మహబూబ్ నగర్ నుంచి ఎంఎస్ఎన్ ఫార్మా అధినేత సత్యనారాయణ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి లకు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి సుముఖంగా లేకపోవడంతో ఎవర్ని నిలబెట్టబోతున్నారోనన్న చర్చ జరుగుతోంది.