మహారాష్ట్రలో తలనొప్పిగా మారిన రెవెన్యూ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేను బీజేపీ సాగనంపింది. ఈ అంశంపై బీజేపీని ఇరుకున పెట్టాలనుకున్న కాంగ్రెస్ కు నిరాశ కలిగించింది. పాకిస్తాన్ లో ఉంటున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో అనేకసార్లు ఫోన్లో మాట్లాడారని ఖడ్సేపై ఆరోపణలు వచ్చాయి. వాటిని ఖడ్సే ఖండించారు. ఈలోగా బాంబులాంటి మరో ఆరోపణ వచ్చి పడింది.
పుణేలో ఖరీదైన ప్లాటు కొనుగోలు వ్యవహారంలో ఖడ్సే భార్య, అల్లుడు అవకతవకలకు పాల్పడ్డారనేది తాజా ఆరోపణ. ఖడ్సే స్వయంగా రెవెన్యూ మంత్రి అయి ఉండికూడా ప్లాటు విలువను తగ్గించి చూపడానికి సహాయం చేశారనేది దుమారం రేపింది. ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ బలపడింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు మిత్ర పక్షం శివసేన కూడా ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం విశేషం.
రెండేళ్లలో అవినీతి ఆస్కారం లేకుండా పనిచేశామని మోడీ సర్కార్ గొప్పగా చెప్పుకుంటోంది. వికాస్ పర్వ్ పేరుతో దేశ వ్యాప్తంగా విజయోత్సవాలకు ప్లాన్ చేసింది. ఈ సమయంలో ఖడ్సే వ్యవహారం పంటికింద రాయిలా మారింది. అందుకే, తాత్సారం చేయకుండా విషయం తేల్చేయాలని మోడీ, అమిత్ షా నిర్ణయించారు. ఆలస్యం అయ్యే కొద్దీ ఇది కాంగ్రెస్ కు అస్త్రంగా మారుతుందని వారు గుర్తించారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఢిల్లీకి పిలిపించారు. పుణే ప్లాటుకు సంబంధించి వివరాలు అడిగారు. సంబంధిత ఫైలులోని వివరాలను ఆయన మోడీ, అమిత్ షాలకు వివరించారని తెలుస్తోంది. ప్లాటు విలువ విషయంలో గోల్ మాల్ నిజమేనని ఫడ్నవీస్ చెప్పినట్టు సమాచారం. పైగా ఖడ్సే తరచూ వివాదాస్పదంగా మారడం కూడా బీజేపీకి ఇబ్బందికరమని జాతీయ నాయకత్వం భావించింది. ఆయనపై వేటు వేయాలని ఫడ్నవీస్ కు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ముంబై వచ్చిన తర్వాత ఫడ్నవీస్ తన మంత్రివర్గ సహచరులతోనూ చర్చించారు. శనివారం ఖడ్సేను తన నివాసానికి పిలిపించారు. రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో చేసేది లేక ఖడ్సే తన రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ కు కొంత నిరాశ కలిగినట్టుంది. అయినా సరే ఈ అంశాన్ని జారవిడుచుకోరాదని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అందుకే, రాజీనామా చేస్తే చాలదని, ఖడ్సేపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దావూద్ తో సంబంధాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కూడా కాంగ్రెస్ పట్టుబడుతోంది. పుణే ప్లాటు వ్యవహారంపై విచారణకు ఫడ్నవీస్ ఆదేశించ వచ్చని తెలుస్తోంది. తమది అవినీతిని సహించని ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఖడ్సే వ్యవహారం అడ్డుగా మారిందని మోడీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే, విచారణకు ఆదేశించడం సహా ఏ చర్యకైనా వెనుకాడ వద్దని ఆయన ఫడ్నవీస్ కు స్పష్టంగా చెప్పినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి, ఖడ్సే విచారణను ఎదుర్కోవడం తప్పదని తెలుస్తోంది.