తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో రైతులకే కాకుండా ప్లాట్లు, భూసేకరణలో తీసుకున్న భూమికి, వ్యవసాయానికి పనికిరాని భూమి కూడా ఇచ్చిన రైతుబంధు డబ్బులను తిరిగి తీసుకోవాలని…ఇందుకు గాను రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగిస్తోంది.
రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం… ప్రభుత్వం నుండి తీసుకున్న డబ్బును తప్పుడు కారణాలతో క్లైయిమ్ చేసుకున్న వారి నుండి తిరిగి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
కొండలు, గుట్టలతో పాటు వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే చాలా ప్రాంతాల్లో వేలాది ఎకరాలను ప్లాట్లుగా చేసి సొమ్ము చేసుకున్నారు. వాటికి కూడా ఆనాటి కేసీఆర్ సర్కార్ రైతుబంధు ఇచ్చింది. అంతేకాదు ప్రభుత్వం భూసేకరణ చేసిన తర్వాత కూడా అది ప్రైవేటు భూమిగా ఉన్న చోట రైతు బంధు చెల్లించారు. గతంలో శ్రీశైలం హైవేకు కూడా రైతుబంధు వేసిన వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో కేవలం సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సర్కార్…గతంలో చేసిన అనవసరపు చెల్లింపులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పలువురికి నోటీసులు కూడా ఇచ్చినట్లు సమాచారం.