ఏడో తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవిన్యూ చట్టాన్ని ప్రతిపాదించబోతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు, భౌతిక ధూరం పాటిస్తూనే సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలను సిఎం అధికారులను ఇదివరకే ఆదేశించారు. రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేశారు. 2019లో ఆగస్టు 15 కంటే ముందు ఓ సందర్భంలో కేసీఆర్ అసెంబ్లీలోనే… ఆగస్టు 15 తర్వాత తన మార్క్ పాలన అంటే ఏంటో చూపిస్తానని సవాల్ చేశారు. ఆయన ఉద్దేశంలో అప్పట్లో కీలక చట్టాలను మార్చడమే.
అప్పట్లో కేసీఆర్ ప్రధానంగా మూడు చట్టాలపై దృష్టి పెట్టారు. కొత్త రెవిన్యూ చట్టం, కొత్త పంచాయతీరాజ్ చట్టం.. కొత్త మున్సిపల్ చట్టం. వీటిలో తెచ్చే విప్లవాత్మక మార్పులతో… ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ఆయన నమ్ముతున్నారు. మూడు చట్టాలను సమర్ధంగా అమలు చేస్తే పాలనలో వేగం, అవినీతి నిర్మూలన, పారదర్శకత వస్తుందని నమ్ముతున్నారు. వీటిలో కొత్త పంచాయతీరాజ్ చట్టం.. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చాయి. కానీ రెవిన్యూ చట్టం మాత్రం ఇంకా అసెంబ్లీలో పెట్టలేకపోయారు. కానీ ముసాయిదా మాత్రం ఎప్పుడో సిద్ధమయింది. ప్రస్తుతం రెవిన్యూ అధికారుల అవినీతి పెద్ద ఎత్తున బయట పడుతోంది. ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. రెవిన్యూ వ్యవస్థపై స్వయంగా సీఎంతో పాటు.. సొంత మీడియా కూడా సమరభేరి మోగించింది. ఇప్పుడు ఆ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అసెంబ్లీని ఎన్ని రోజులైనా సరే… అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరిగేలా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం… శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంతో పాటు పలు అంశాలను చర్చించాలని నిర్ణయించారు.