వడ్లు కొనాలంటూ యుద్ధం ప్రారంభించిన టీఆర్ఎస్కు ఢిల్లీ బీజేపీ గట్టిగానే రివర్స్ పంచ్‌లు ఇస్తోంది. ఢిల్లీలో మంత్రులకు అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్రమంత్రి గోయల్ వారిని కలవడానికంటే ముందే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ.. వారికి ద్రోహం చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. పంజాబ్ నుంచి అయినా మరో రాష్ట్రం నుంచి అయినా కేంద్రం బియ్యమే కొంటుందని వడ్లు కొనదని గోయల్ స్పష్టం చేశారు.అయినా వడ్లు కొనాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారని.
ఫిబ్రవరిలో ధాన్యం కొనుగోలు విషయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అన్ని రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని ఒక్క తెలంగాణ మాత్రమే చేసుకోకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారనివ విమర్శించారు. రా రైస్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందని.. ఎంత ముడి ధాన్యం ఇస్తారో తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదన్నారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే బియ్యం సేకరణ జరుగుతుందన్నారు.
గతంలో కంటే ఏడున్నర రెట్లు ఎక్కువగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ తన చేతకాని తనాన్ని కేంద్రంపై రుద్దేప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అని గోయల్ విమర్శించారు. ప్రధానికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రతి అంశానికి గోయల్ కౌంటర్ ఇచ్చారు.ఇప్పుడు గోయల్ చెప్పిన అంశాలు తప్పని.., టీఆర్ఎస్ నిరూపించాల్సి ఉంది.