చాలా కాలం నుంచి సోదిలో లేకుండా పోయాడు నిర్మాత పివీపీ (ప్రసాద్ వి.పొట్లూరి). ఇప్పుడు ఓ ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారాడు. ”రియల్ హీరో బాబు… రీల్ హీరో కాదు.. లంగా డాన్సులేసే స్టార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జావా బైక్.. హతవిధీ” అంటూ ట్వీట్ చేసి.. స్టార్ హీరోల అభిమానుల్ని హర్ట్ చేశాడు. ఓ రైల్వే ఉద్యోగి సాహసంతో.. ఒకరి ప్రాణాలు కాపాడినందుకు… ప్రభుత్వం జావా బైక్ ని… బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ఓ బడా హీరోపై సెటైర్ వేయాలని చూశాడు పీవీపీ. `లంగా డాన్సులు` అంటూ ఓ ప్రముఖ హీరోని ఉద్దేశించి ట్వీట్ చేయడంతో.. పీవీపీపై విమర్శలు మొదలయ్యాయి.
”నువ్వు సినిమా ఇండ్రస్ట్రీ నుంచే వచ్చాయి.. ఆ హీరోల చుట్టూనే తిరిగావు. వాళ్లతో సినిమాలు చేసి, ఇప్పుడు వాళ్లపైనే జోకులేస్తావా” అంటూ కొంతమంది పీవీపీని ట్రోల్ చేస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు… `అసలు నువ్వు ఈ సమాజానికి చేసిందేంటి` అని ప్రశ్నిస్తున్నారు. పీవీపీ ట్వీట్… పవన్ కల్యాణ్ ని ఉద్దేశించిందన్నది కొందరి మాట. పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ప్రకటన కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది పీవీపీనే అని పెద్ద టాక్ నడిచింది. అంతే కాదు.. తను జనసేన టికెట్ కూడా ఆశించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తరవాత… వైకాపా తరపున విజయ వాడ నుంచి పోటీ చేశాడు పీవీపీ. అప్పట్నుంచి పవన్ తో సంబంధాలేం లేవు. అందుకే ఇప్పుడు ఆ కక్షని ఇలా తీర్చుకుంటున్నాడేమో అని.. పీవీపీని ఓ రేంజులో ఆడుకుంటున్నారు జనాలు.