ఎవరైనా తమపై దాడి చేస్తూంటే…ఎదురుదాడి చేయడానికి హక్కు ఉంది. ఆత్మరక్షణ కోసం చంపినా నేరం కాదని చట్టాలు చెబుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం దాడులు చేసే వాళ్లు వైసీపీ వాళ్లయితే.. మారణాయుధాలతో దాడులు చేస్తున్న సరే… వాళ్లు రౌడీషీటర్లు అయినా సరే… దాడులు చేయించుకోవాలి. ఎదురు తిరిగితే మాత్రం హత్యాయత్నం కేసులు పెడతారు. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే దాడులు చేసిన వారిపై మాత్రం కేసులు ఉండవు. కళ్ల ముందు కనిపిస్తున్నా… ప్రజలు హవ్వ అని.. అని అనుకుంటారని తెలిసినా పోలీసులు మాత్రం నిరభ్యతరంగా రివర్స్ పోలీసింగ్ చేస్తూనే ఉన్నారు.
వైసీపీ నేతలయితే చట్టం వర్తించదా ?
ఏపీలో నేరాలు , ఘోరాలు ప్రతీ రోజూ సంచలనం రేపుతున్నాయి. రాజకీయ నేరాలయితే చెప్పాల్సిన పని లేదు. పోలీసులు వైసీపీ నేత అనే ట్యాగ్ ఉంటే కనీసం కేసు కూడా పెట్టరన్న ధైర్యంతో చెలరేగిపోతున్నారు. విపక్ష నేతలపై దాడులు చేస్తున్నారు. సభలు సమావేశాల్లో రగడ చేస్తున్నారు. దాడులు చేయడానికి పక్కా ఏర్పాట్లతో వస్తున్నారు. అయినా వారికి పోలీసుల సహకారం లభిస్తోంది కానీ.. అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు ఎదురుదాడికి దిగితే… ఇదే సందనుకుని బాధితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు.
పోలీసుల్ని కొట్టినా కేసులుండవు … ఖాకీ పౌరుషం అదేనా ?
వైసీపీ నేతలు పోలీసుల్ని కొట్టినా కేసులు ఉండవు,. ఇటీవలికాలంలో ఎన్ని పోలీస్ స్టేషన్లపై దాడి ఘటనలు జరిగాయో లెక్కలేదు. ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ లో ఓ ఎస్ ఐ ముక్కు పగలగొట్టాడు.. వైసీపీ నేత అయిన రౌడీషీటర్. ఓ సెబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి మహిళా పోలీసును వేధిస్తే… కేసు పెట్టిన దిక్కులేకపోగా.. తిరిగి డిపార్టుమెంటే మహిళా పోలీసును వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లోకేష్ పాదయాత్రలో సోడా బుడ్లు, రాళ్ల దెబ్బకు పోలీసులకూ గాయాలయ్యాయి. కానీ దాడి చేసిన వారిపై మాత్రం కేసుల్లేవు. పోలీసులు పూర్తిగా తన ఖాకీ డ్రెస్ పౌరుషాన్ని మడిచి పెట్టేశారని అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటివి ప్రజల తిరుగుబాటుకు కారణం అవుతాయి !
చట్టం కొందరికే వర్తింప చేయడం… ఇష్టానుసారంగా కేసులు పెట్టడం.. ప్రజల్లో అసంతృప్తిని పెంచుతాయి. వారిలో అభద్రతా భావాన్ని పెంచుతాయి. పోలీసులు తమకు రక్షణగా లేరని.. వారు డేంజరస్ గా ఉన్నారని…. ఇక తమను తాము కాపాడుకోవాలంటే… తిరుగుబాటు తప్పదని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అలాంటి సూచనలు ప్రారంభమసూచికంగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో అసహనాన్ని పెంచే ఒక్క ఘటన జరిగితే.. పోలీసులపై తిరుగుబాటు వస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేయలేం. ప్రజల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదనేది చరిత్ర చెప్పే పాఠం.