రోడ్లు, కాలువల నిర్మాణం… ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకుంటూ బడా సంస్థగా ఎదిగిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి రివర్స్ టెండరింగ్‌లో దక్కిన పోలవరం ప్రాజెక్ట్ పెనుభారంగా మారుతోంది. నిధులు వచ్చే దారి లేక..తన దారి తాను చూసుకోవాలనే ఆలోచన చేస్తోంది. రూ. ఐదు వందల కోట్ల తక్కువగా పనులు తీసుకున్న మేఘా.. మరో విధంగా లాభం సంపాదించాలని అనుకుంది. విద్యుత్ ప్రాజెక్ట్ అంశం కోర్టులో ఉంది. ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి నిధులు పెండింగ్‌లో పడిపోయాయి. ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియడం లేదు. పనులు నత్తనడనక చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సి వస్తూండటం… కేంద్రం నిధులు రీఎంబర్స్ చేసే వరకూ రాష్ట్రం ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవడంతో.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఇబ్బందుల్లో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఏదైనా పనిని మొదటి నుంచి ప్రారంభిస్తే.. కాంట్రాక్ట్ కంపెనీలకు పని సులభం అవుతంది. మధ్యలో పనిని తీసుకుని.. పూర్తి చేయాలంటే.. చాలా కష్టం అవుతుంది. పోలవరం లాంటి ప్రాజెక్ట్ అయితే అది మరీ డేంజర్. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణగా… వారి రాజకీయ ఆసక్తులు.. ఇతర ప్రయోజనాల కోసం మేఘా ఇంజినీరింగ్ పోలవరం ప్రాజెక్ట్ చేపట్టక తప్పలేదు. కనీసం పేరు అయినా వస్తుందని మేఘా రంగంలోకి దిగింది. కానీ దిగిన తర్వాతే లోతేంటో తెలిసినట్లుగా పరిస్థితి అయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు నిధుల కొరత.. మరో వైపు.. పనులు చేయలేని పరిస్థితి ఆ సంస్థకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
కొత్తగా … పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదని స్పష్టత వస్తోంది. పైగా మేఘా ఇంజినీరింగ్ కంపెనీ.. లద్దాఖ్ సరిహద్దుల్లో టన్నెళ్ల నిర్మాణం కాంట్రాక్టులు పొందింది. రక్షణ పరికరాల తయారీ రంగంలోనూ అడుగు పెడుతోంది. ఇలాంటి సమయంలో… పోలవరం టెన్షన్‌ను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కాంట్రాక్టుల రంగంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.