రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రివర్స్ టెండర్లకు సిద్ధమయింది. కృష్ణా బోర్డు అనుమతి రాకపోయినా… ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతూండటంతో.. హడావుడి లేకుండా.. టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. పర్యావరణం విషయంలో.. ఎన్జీటీలో పిటిషన్ దాఖలయింది. అయితే.. నిర్మాణం చేపట్టవద్దని.. టెండర్లకు మాత్రం అభ్యంతరం లేదని ఎన్జీటీ చెప్పింది. అదే సమయంలో.. ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించాలన్న కృష్ణా రివర్ బోర్డు అనుమతి తప్పనిసరి. ఇది పాత ప్రాజెక్టేనని చెబుతూ.. ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.
ఎత్తిపోతల ప్రాజెక్టు రూ.3,278.18 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి సంగమేశ్వరం వరకు రో జూ 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని టెండర్లలో పేర్కొన్నారు. పనులు దక్కించుకున్న సంస్థ 30 నెలల్లోనే పూర్తి చేయాలని షరతు విధించారు. జ్యూడిషియన్ ప్రివ్యూ కమిటీకి ప్రభుత్వం… ఈ టెండర్ల ప్రతిపాదలను పంపింది. జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదం మేరకు.. మార్పులూ చేర్పుల ఆధారంగానే టెండర్లను పిలవాల్సి ఉంది. కృష్ణాబోర్డుకు తెలంగాణ ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసింది. దీంతో కృష్ణా బోర్డు .. ప్రాజెక్టు డీపీఆర్‌ను సమర్పించాల్సిందేనని.. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవలసిందేనని చెబుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం… ముందు ప్రాజెక్టు నిర్మించాలనే పట్టుదలతో ఉంది.
రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ఖరారు ప్రక్రియను నిలిపి వేసేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈమేరకు సోమవారం బోర్డుకు లేఖ రాసింది. అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఖరారు చేస్తోందని తెలంగాణ వాదిస్తోంది. అయితే.. అధారిటీలను కాదని.. ఏకపక్షంగా.. ప్రాజెక్టు నిర్మాణం కోసం ముందుకెళ్తే ఏ క్షణమైనా ప్రక్రియ ఆగిపోతుందని.. ఏపీ సర్కార్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న అభిప్రాయాలు… నిపుణుల నుంచి వస్తున్నాయి.