ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ 11 పరుగుల తేడాతో గెలిచింది. వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఒత్తిడిలో ఉంది. ఈ సమయంలో.. ఈ విజయం ఊరటనిచ్చింది. కానీ ఈ విజయం చుట్టూ ఇప్పుడు వివాదాలు అలుముకుంటున్నాయి. భారత్ తొండాట ఆడిందనే విమర్శలు ఆస్ట్రేలియా మద్దతుదారుల నుంచి వస్తున్నాయి. అనేక మంది మాజీ ప్లేయర్లు రెండు వైపులా మాట్లాడుతున్నారు.
టీ ట్వంటీ కొత్త నిబంధనల ప్రకారం.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు.. బ్యాటింగ్, బౌలింగ్ చేయవచ్చు. దీన్ని కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటారు. దీనికి ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి. తలకు మాత్రమే దెబ్బ తగిలి ఉండాలి. ఆ తర్వాత ఆ ఆటగాడు మ్యాచ్ ఆడలేని పరిస్థితుల్లో ఉండాలి. అదే సమయంలో.. గాయపడిన ఆటగాడు.. బౌలర్ అయితే.. బౌలర్.. బ్యాట్స్‌మెన్ అయితే బ్యాట్స్‌మెన్‌ను మాత్రమే కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అంగీకరిస్తారు. భారత్ గెలిచిన మ్యాచ్‌లో ఈ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా యజువేంద్ర చాహల్ వచ్చాడు. రవీంద్ర జడేజా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బాల్ వచ్చి హెల్మెట్‌కు బలంగా తగిలింది. దాంతో ఆయన తర్వాత ఫీల్డింగ్‌కు.. బౌలింగ్‌కు రాలేదు. ఆయన బదులుగా.. మ్యాచ్ రిఫరీకి చెప్పి… చాహల్‌ను బరిలోకి దించారు.
మొదట్లో ఇది వివాదాస్పదం కాలేదు. కానీ మ్యాచ్ పూర్తయిన తర్వాత చూస్తే.. కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా వచ్చిన చాహల్‌నే.. మ్యాచ్‌ను మలుపుతిప్పి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అధికారికంగా తుది పదకొండు మందిలో లేకపోయినా… సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం .. ఆస్ట్రేలియన్లకు పుండు మీద కారం రాసినట్లు అయింది. అసలు జడేజాకు దెబ్బ తగలలేదని.. ఆరోపించడం ప్రారంభించారు. జడేజా హెల్మెట్‌కు బాల్ తగినప్పుడు.. గ్రౌండ్లోకి ఫిజియో కానీ.. డాక్టర్ కానీ రాలేదు. ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాతనే బరిలోకి దిగకూడదని నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో జడేజా ఆల్ రౌండర్ అయితే చాహల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇలా పోలికలు తీసుకుని టీమిండియా తొండి ఆట ఆడిందనే విమర్శలు ప్రారంభించారు.
అయితే భారత్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని.. పూర్తిస్థాయిలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని స్పష్టం చేశారు. మ్యాచ్ రిఫరీ కూడా.. ఆస్ట్రేలియన్ అనే సంగతిని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ వివాదం.. భారత్ విజయంపై ఓ మరకను మాత్రం అంటించినట్లయింది.