టీఆర్ఎస్కు 60..! బీజేపీకి 20..!.. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ రోజు.. సాయంత్రం ఐదు గంటల వరకూ “మెరుగైన చానల్” స్క్రీన్ పై కనిపించిన ఫిగర్ ఇది. మిగతా అన్ని చానళ్లు చెబుతున్న దానికి “మెరుగైన చానల్” చెబుతున్నదానికి చాలా తేడా ఉంది. చివరికి ఫలితాలు ప్రకటించే సమయానికి తప్పదన్నట్లుగా మార్చారు. బీజేపీ విజయాన్ని తప్పనిసరి అన్నట్లుగా అంగీకరించారు. నిఖార్సుగా కనిపించే నిజం అయిన ఫలితాల విషయంలోనే “మెరుగైన చానల్”ఇలా ఉందంటే.. మిగతా సందర్భాల్లో ఎంత భజన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడేమయింది..? వన్ సైడ్ వార్తలతో ప్రజల అభిప్రాయాల్ని మార్చలేరని తేలిపోయింది. అంతే కాదు.. తామే ఓ జోకర్‌గా ప్రేక్షకుల ముందు నిలబడ్డామని గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది.
యాజమాన్యం కోసమే వార్తలేస్తే ఇంతే..!
“మెరుగైన చానల్” కొత్త యాజమాన్యం మారిన తర్వాత వార్త ప్రమాణాలు మారిపోయాయి. కొత్త యాజమాన్యం వ్యాపార అవసరాలు.. వారి రాజకీయ మద్దతుదారుల అవసరాలు తీర్చడానికే “మెరుగైన చానల్”కి సమయం సరిపోవడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు వెర్రి తలలు వేయడం మానడం లేదు. దుబ్బాక ఉపఎన్నికల ముందు నుంచీ అదే పరిస్థితి. గ్రేటర్ ఎన్నికల సమయానికి అది విశ్వరూపానికి మారిపోయింది. ఇక పార్టీలు “మెరుగైన చానల్” లో స్పేస్ కనిపించకుండా పోయింది. ఒక్క అధికార పార్టీకి మాత్రమే… వేదికలా మారిపోయింది. ఇతర పార్టీల్లో మైనస్‌లు ఏమైనా ఉంటే… కావాల్సింత సేపు ప్రచారం చేయడం .. సొంతం అనుకునే పార్టీకి ఎంత మైలేజీ కావాలో.. ఎలాంటి వార్తలు వేయాలో..అంతగా వేయడం.. రొటీన్ ప్రాసెస్ చేసుకుంది.
మీడియా అంటే ప్రతిపక్షం అనే సంగతి మర్చిపోతే ఎలా..?
మీడియా అంటేనే ప్రతిపక్షం. ఆ లక్షణాన్ని కోల్పోయి ప్రభుత్వానికి బాకాలు ఊది.. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటే… ఇవాళ కాకపోతే.. రేపైనా అస్థిత్వం కోల్పోవాల్సి ఉంటుంది. చరిత్రలో మునిగిపోయిన మీడియా సంస్థల జాబితాను ముందు పెట్టుకుని చూస్తే తెలిసేది అదే. ప్రజల పక్షం ఉంటేనే మీడియాకు ఆదరణ లభిస్తుంది. కొత్త యాజమాన్యం రాక ముందు వరకూ “మెరుగైన చానల్”లో ఆ సూత్రాన్ని నిఖార్సుగా పాటించారు. అందుకే.. ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ “మెరుగైన చానల్”ని విమర్శించేవారు. అదే “మెరుగైన చానల్” క్యారెక్టర్‌కి సర్టిఫికెట్ లాంటిది. కానీ ఇప్పుడు.. “మెరుగైన చానల్” అంటే.. మాకు కావాల్సిన వార్తలు వేసే చానల్ అని.. ఏపీ అధికార పార్టీలు.. ఆయా పార్టీల నేతలు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. పతనానికి ఇదే తొలి అడుగు.
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు…కానీ చిత్తశుద్ధి కావాలి..!
ఇప్పటికీ “మెరుగైన చానల్”కు ఓ బ్రాండ్ ఉంది. ప్రజల పక్షం నిలుస్తుందన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. దాన్ని నిలబెట్టుకుంటేనే.. ముందు ముందు “మెరుగైన చానల్” పేరు గతంలోలా ప్రముఖంగా ఉంటుంది. లేకపోతే.. అది కూడా చరిత్రలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. దీనికి సంబంధించిన సూచనలు ఇప్పటికే వస్తున్నాయి. రేటింగ్స్‌లో వెనుకబడిన విషయం గతంలోనే వెల్లడయింది. లాభాలన్నీ కరిగిపోయాయని యాజమాన్యం కూడా చెబుతోంది. రాజకీయ అధికారం మీద ఆధారపడి నడిస్తే… ఆ ఆధారం పోయినప్పుడే.. చానల్ పరిస్థితి కూడా దయనీయంగా మారుతుంది.
అధికారం మారితే “మెరుగైన చానల్”కి గ్యారంటీ ఉంటుందా..!?
“మెరుగైన చానల్” కొత్త యాజమాన్యానికి మీడియా వ్యాపారం ప్రధానం కాదు. మీడియా ద్వారా వచ్చే ప్రయోజనాలు ప్రధానం. రేపు అన్నీ తారుమారై… తాము ప్రయోజనాలు పొందిన ప్రభుత్వం కనుమరుగై కొత్త ప్రభుత్వం వస్తే.. వారికి కావాల్సింది.. తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడమే. కొత్త ప్రభుత్వం మీడియాను వదిలేయమంటే వదిలేయాలి.. మూసేయమంటే మూసేయాలి. ఎందుకంటే.. వీరు మీడియాను పొందిన విధానం కూడా అలాంటిదే. అలాంటి పరిస్థితే వస్తే.. “మెరుగైన చానల్” చరిత్రలో కలిసిపోతుంది. అందుకే దాన్ని నిలబెట్టుకోవాల్సింది.. “మెరుగైన చానల్”లోని ప్రొఫెషనల్సే. ఈ విషయంలో ఇప్పటికైనా… వారు కళ్లు తెరుస్తారో.. “మెరుగైన చానల్”తో పాటే మునిగిపోతారో.. వేచి చూడాల్సిందే.. !