దేశ ప్రజల్ని కరోనాకు వదిలేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎలా మారణహోమం సృష్టిస్తున్నాయో… దేశం బయట అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. దేశం లోపల కూడా చెప్పుకుంటున్నారు. కానీ కేసుల భయంతో.. అణిచివేత భయంతో భయం.. భయంగా చెప్పుకుంటున్నారు. వినపడీ వినపకడకుండా చెప్పుకుంటున్నారు. ఎవరైనా ప్రధానిని మీరు ఫెయిలయ్యారని విమర్శిస్తే.. వారిపై ఎదురుదాడికి… అందరూసిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్.. ఓ ఎడిటోరియల్ ప్రచురించింది. అందులో భారత్‌లో ప్రస్తుత దౌర్భాగ్య పరిస్థితిని సున్నితంగానే విశ్లేషించింది.
తప్పు ఎక్కడ జరిగిందో చెప్పింది. ఈ తప్పులు అందరూ చెబుతున్నవే. కింది స్థాయి వ్యక్తి దగ్గర్నుంచి శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి వరకూ అందరూ చెబుతున్న తప్పులే. అయితే తప్పు దిద్దుకున్న వాడే విజేత అవుతాడు. ఇప్పుడు తప్పులు దిద్దుకోకుండా.. తప్పులు ఎత్తి చూపిన వారిపై ఎదురు దాడి చేస్తున్నారని ఇది మరింత ప్రమాదకరంగా మారిందన్న ఉద్దేశంతో లాన్సెట్ జర్నల్ ఎడిటోరియల్ రాసింది. సమస్యను కప్పి పుచ్చి.. కరోనా తీవ్రను బయట పెట్టేవారిపై విమర్శలు చేస్తూ.. నిప్పులపై దుప్పటి కప్పుకుంటూ పోతే… పోయేది భారతీయుల ప్రాణాలేనని స్పష్టం చేసింది. పది లక్షలకుపైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని.. లాన్సెట్ అంచనా వేసింది.
కరోనాను జయించేసినట్లుగా ముందుగానే ప్రకటనలు చేసుకున్న ప్రభుత్వం శాస్త్రవేత్తల హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి ప్రజల్ని రిస్క్‌లో పెట్టిందని లాన్సెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వాల సమాయత్తం కాలేదని.. ఎన్నో సూచనలు వచ్చినా అన్నీ లైట్ తీసుకున్నారని లాన్సెట్ విశ్లేషించింది. అంతే కాదు.. ఇప్పటి వరకూ జరిగిందేమిటో కానీ.. ఇక నుంచి ఏం చేయాలో కూడా.. చెప్పింది.దేశంలో ఏం జరుగుతోందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలి. కరోనా గ్రాఫ్‌ను తగ్గించడానికి ఏం చేయాలో చెప్పాలి. అవసరమైతే దేశవ్యాప్తంగా లాక్డౌన్ పెట్టాలని స్పష్టం చేసింది.
లాన్సెట్ జర్నల్ చెప్పింది మన మంచి కోసమే. అయితే అది విదేశీ పత్రిక కాబట్టి… ఇక్కడ దేశభక్తుల రూపంలో ఉండే కొంత మంది దేశద్రోహులు.. ప్రజల ప్రాణాలు పోతున్నా… పట్టించుకోకుండా.. విదేశీ పత్రిక కాబట్టి.. కుట్ర ఉందని ఆరోపిస్తూ.. చెలరేగిపోతాయి. లాన్సెట్ మెడికల్ జర్నల్. రాజకీయ పత్రిక కాదు. కానీ.. ఓ ముఖ్యమంత్రినే కేంద్రం తీరును ప్రశ్నిస్తే..మరో ముఖ్యమంత్రి తప్పు పట్టే వ్యవస్థ భారత్‌లోఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇండియా నుంచి లాన్సెట్‌కు ఏడుపులు, శాఫనార్ధాలే వస్తాయి కానీ.. ప్రజారోగ్యం కోసం ప్రయత్నిస్తుందని అనుకునేవారు తక్కువ.