ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధార రాష్ట్రం. సాగునీటి ప్రాజెక్టులు కీలకం. లోట్బడ్జెట్తో ప్రారంభించిన రాష్ట్రంలో… నీటి పారుదల ప్రాజెక్టుల సంగతేమిటన్న భయం చాలా మందిలో ఏర్పడింది. కానీ.. ఐదేళ్లకు ముందు.. ఐదేళ్ల తర్వాతా పరిస్థితి చూస్తే.. కచ్చితంగా… రైతులకు ధైర్యం కలుగుతుంది. 2014 తర్వాత సాగునీటి రంగంలో రూ.63,657.52 కోట్లు ఖర్చు చేశారు. 32.02 లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించారు.
అంతకు ముందు… ఆ తర్వాత ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ..!
2004-14 మధ్య 86 ప్రాజెక్టులను రూ1,90,569 కోట్ల అంచనా విలువతో చేపట్టారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పోలవరం కాలువల్ని కూడా తవ్వలేదు. 2014 తర్వతా వేగంగా పోలవరం నిర్మాణం జరిగింది. 2014 తర్వాత ఈ ప్రాజెక్టుపై రూ.10,227.92 కోట్లు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతలతో గోదావరి-కృష్ణా అనుసంధానం చేశారు. 4 ఏళ్లలో 263 టీఎంసీల గోదావరి వరద జలాలను మళ్లీంచారు. ఈ నీటితో కృష్ణా డెల్టాలో పంటలను కాపాడారు. రాయలసీమ కరవు ప్రాంతాలకూ నీటి సరఫరా. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది 115.40 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 31.65 టీఎంసీల తరలించారు. దీంతో వర్షాభావం ఉన్నా… కరువు అనే పరిస్థితి పెద్దగా ఎక్కడా రాలేదు. ఈ ఐదేళ్ల కాలంలో.. ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన భరోసా ఇదే. హిందూపురం నియోజకవర్గానికి కూడా.. కృష్ణా నీరు చేరడం.. కొత్త చరిత్రగా చెప్పుకోవచ్చు.
కరువును జయించే యజ్ఞంలో ముందడుగే..!
రాష్ట్రంలో మొత్తం 62 ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించారు. ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభించారు. మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 26 ప్రాజెక్టుల్లో వేగంగా పనులు సాగుతున్నాయి. మరో 13 ప్రాజెక్టులు కొత్తగా నిర్మించేందుకు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం, 2 కోట్ల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బహుద, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానించనున్నారు. 62 సాగునీటి ప్రాజెక్టుల్లో గోదావరి-పెన్నా అనుసంధానం, బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్ నిర్మాణం తప్ప మిగతావన్నీ మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 140 చిన్న, పెద్ద నదులున్నాయి. వాటన్నింటినీ కాలువలకు అనుసంధానం చేస్తే గ్రావిటీ, లిఫ్ట్‌ల ద్వారా 2 కోట్ల ఎకరాలకు నీరు ఇవ్వగలమంటున్నారు.
ఎన్నికలకు ముందు కొత్త ప్రణాళికలు..!
కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజికి దిగువన మరో కొత్త బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లాలోని వరకపుడిశిల వద్ద ఓ ఎత్తిపోతల పథకం నిర్మించి గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల్లోని ఆనకట్టుకు ప్రయోజనం కల్పించనున్నారు. సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ నుంచి చిత్తూరు జిల్లాలోని బాలాజీ జలాశయానికి నీరు తరలించనున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా మల్లెమడుగు, బాలాజీ జలాశయాలకు మరో వైపు నుంచి నీటిని మళ్లించే ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ప్రకటన రాక ముందే రూ.6326.62 కోట్లతో వంశధార-బాహుదా అనుసంధానం పనులు, పశ్చిమ కృష్ణాలో మెట్ట ప్రాంత అవసరాలు తీర్చేలా రూ.698.90 కోట్లతో విస్సన్నపేట ఎత్తిపోతల పనులకు దీని ప్రకారం ఆమోదం లభించింది. విస్సన్నపేట ఎత్తిపోతల పథకం వల్ల కృష్ణా జిల్లా 5 మండలాల్లోని 50 వేల ఎకరాలకు ప్రయోజనం కలగనుంది.
పోలవరం కళ్ల ముందు కనిపిస్తోంది. రాయలసీమలో కృష్ణా నీళ్లు పారుతున్నాయి. అనంతపురం జిల్లా కూడా పచ్చబడింది. ఈ ఐదేళ్లలో వచ్చిన అనూహ్యమైన మార్పు ఇదే. రోజూ చూసేవారికి ఎదుగుదల కనిపించదు కానీ.. ఐదేళ్ల కిందట… ప్రాజెక్టుల పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి అంచనా వేస్తే.. పురోగతి ఎక్కువగానే కనిపిస్తుంది.