ఓ వైపు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది..! ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని.. జీపీఎఫ్ సొమ్మును ప్రభుత్వం అనుమతి లేకుండా వాడుకుందని ఆందోళనలు చేస్తున్నారు. విద్యార్థులు రోడ్డెక్కి తమ స్కూళ్లను అమ్మేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు రోడ్డున పడి న్యాయం కోసం పాదయాత్ర చేస్తున్నారు. వారిపై లాఠీ విరుగుతోంది. మరో వైపు డిస్కంలకు పాతిక వేల కోట్ల బాకీ ఉన్నారని ఏపీఈఆర్సీ లేఖలు రాస్తోంది. మెడికల్ పరికరాల బకాయిలు చెల్లించలేదు కాబట్టి సప్లయి ఆపేస్తున్నామని మెడికల్ డివైసెస్ కంపెనీలు రెడ్ నోటీసులు జారీ చేస్తూంటాయి. రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రారు. ఏపీ అడుక్కు తింటోందని పక్క రాష్ట్రాల వాళ్లు ఎగతాళి చేస్తున్నారు. తమ పెన్షన్లు తీసేశారనని వికలాంగులు కత్తులు పట్టుకుని గ్రామ సచివాలయాల మీద దాడులు చేస్తున్నారు.
ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం వివిధ వర్గాల ప్రజలు రోడ్డున పడుతూంటే ప్రభుత్వం మాత్రం చాలా గొప్పగా విప్లవం తీసుకొస్తున్నామని ప్రకటించుకుంది.ఆ విప్లవం ఏమిటంటే.. తమ వైసీపీకి 14 ఎమ్మెల్సీ స్థానాలు దక్కడం. అందులో తమ పార్టీ నేతలైన వారికి పదవులు పంపకం చేయడం.. అదీ కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీల లెక్క చెప్పి అందర్నీ పైకి తీసుకొచ్చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రజలు రోడ్డున పడ్డారని.. వారి సమస్యలేమిటన్నదానిపై చర్చించేందుకు కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.
ఒక్క సారిగా ఇన్ని వర్గాలు రోడ్డున పడటం సహజంగా జరగదు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. ఏవరేమైతే మాకేంటి అన్న పద్దతిలో ఉండిపోవడంతో సమస్య జఠిలమవుతోంది. ఓ ప్రత్యేకమైన కారణాలతో ప్రభుత్వానికి అవసరమైన వాటిని మాత్రమే పెద్దలు ఇష్యూగా పరిగణిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి అవసరం కాబట్టి ఆ దిశగా దృష్టి పెట్టి చేస్తున్నారు. అది మరింత వివాదాలకు కారణమయింది కానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. రాజధాని సమస్యను ఎప్పటికప్పుడు పెంచి పెద్ద చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు సృష్టించిన ప్రభుత్వాలకు పరిష్కారానికి దారుల్లేకుండా చేసుకుంది. ఇవే సమస్యతో ఉంటే.. పొరుగులు రాష్ట్రాల వారు అడుక్కుతింటున్నారంటూ ఎటకారాలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఇది ఏపీ ప్రజల్ని మరింతగా వేదనకు గురి చేస్తోంది.