బీజేపీ రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఈటల రాజేందర్‌కు భారీ హామీలు ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు. దీని వెనుక పెద్ద కథ జరిగిందని బీజేపీలోనే చర్చ జరుగుతోంది. ఈటలను పార్టీలో చేర్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. కేంద్ర పెద్దల్ని ఒప్పించారు . దీనికి కారణం…బీసీ నినాదంతో పాటు…పార్టీలో దూకుడుగా ఉంటూ… పట్టు పెంచుకుంటున్న బండి సంజయ్‌కు చెక్ పెట్టడమేనంటున్నారు. బండి సంజయ్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. ఈటల కూడా అదే జిల్లా. దీంతో.. బండి సంజయ్ ప్రాధాన్యం ఆటోమేటిక్‌గా తగ్గుతుందని.. ఈటలకు ప్రాధాన్యం పెరుగుతుందని .. కిషన్ రెడ్డి తన పట్టు నిలుపుకుంటారని.. విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బండి సంజయ్ అధ్యక్షుడు అయిన తర్వాత చాలా దూకుడుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. దీంతో అధ్యక్షుడు బండి సంజయ్ ఇమేజ్ పార్టీలో అమాంతం పెరిగింది. నేరుగా ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందించారు. అయితే తర్వాత జరగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని సైతం బీజేపీ కోల్పోయింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సైతం బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. దీంతో బండి సంజయ్ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే బలమైన గ్రూప్ మరింతదూకుడు పెంచింది.
ఢిల్లీలో కిషన్ రెడ్డి కీలక పొజిషన్లో ఉండటంతో… ఆయన వర్గం వారికే పనులు అయ్యేలా ఢిల్లీలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు. బండి సంజయ్ సన్నిహితులు అనుకున్న వారికి పార్టీ పెద్దల దర్శనం దక్కడం లేదు. ఈటల ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయన వెంట వివేక్ ఉన్నారు కానీ. బండి సంజయ్‌కు కనీస సమాచారం లేదు. పరిస్థితుల్ని గమనించి కొంత మంది నేతలు.. బండి సంజయ్ క్యాంప్ నుంచి కిషన్ రెడ్డి క్యాంప్‌కు వెళ్తున్నారు. బీసీకి చెక్ పెట్టేందుకే మరొక బీసీని పార్టీలోకి తీసుకొస్తున్నారని ఫైనల్‌గా బీజేపీలో ఓ క్లారిటీ వచ్చింది. ఈ పోరాటంలో ఎవరు నిలబడతారో కానీ.. అంతిమంగా కిషన్ రెడ్డి రాజకీయం గెలుస్తుందని.. ఆయన వర్గీయులు అనుకుంటున్నారు.