వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కచ్చితంగా నెల రోజులయింది. ఈ నెల రోజుల్లో.. ఆయన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల వెల్లువ పారించారు. అక్రమ కట్టడాలను వదలి పెట్టేది లేదని.. వరుసగా నోటీసులు ఇస్తున్నారు. ప్రజావేదికను కూల్చేశారు. అదే సమయంలో.. తమ పాలన ఎలా ఉండాలో అధికారవర్గాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పర్ఫెక్ట్ పాలకుడు ఎలా అడుగులు వేయాలో… తొలి అడుగులు అలానే వేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
1. సంక్షేమం నిర్ణయాల్లో దూకుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి … రాజన్న రాజ్యం తెస్తానని చెప్పేవారు. వైఎస్ హయాంలో.. సంక్షేమ పథకాలను ఉద్దేశించి.. జగన్ తో పాటు .. ఆ పార్టీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేసేవారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల్లో అదే మార్క్ కనిపించేలా చూసుకున్నారు. మంత్రివర్గ తొలి సమావేశంలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలం అందేలా చర్యలు తీసుకున్నారు. పెన్షన్ రూ. 250 పెంపు, పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు వంటి నిర్ణయాలను పెద్దగా చర్చ లేకుండానే తీసుకున్నారు. ఎన్నికల ప్రచారసభల్లో జగన్ .. ఎప్పుడూ ఓ మాట చెబుతూ ఉంటారు.. నాన్నగారి పక్కన నా ఫోటో పెట్టుకునేలా పరిపాలిస్తానని..! తొలి నిర్ణయాల్లో ఆ ముద్ర కనిపించేలా చేసుకున్నారు. సంక్షేమ రంగంలో.. వైఎస్ తర్వాత అంత స్థాయిలో తనదైన ముద్ర వేయడానికి ఆయన … ఆర్థిక భారం గురించి ఆలోచించడం లేదు.
2. ఉద్యోగులు, చిరుద్యోగులకు పన్నీరు..!
ఉద్యోగుల పట్ల.. జగన్మోహన్ రెడ్డి అత్యంత సానుకూలంగా వ్యవహరించారు. తొలి రోజే.. ఉద్యోగులకు మధ్యంత భృతిని ఇరవై ఏడు శాతం పెంచారు. ఆర్థిక భారం అయినా ఉద్యోగులకు మేలు చేయడానికి ఎలాంటి కార్యక్రమాలనైనా చేపడతామని తన చర్యల ద్వారా చెప్పకనే చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్పర్సన్ల జీతాల పెంచారు. గ్రామ వాలంటీర్ల నియామకాలు ప్రారంభించారు.
3. రైతులకు స్వర్ణయుగం తెచ్చే ప్రయత్నాలు..!
రైతులకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చే నిర్ణయాలు.. జగన్మోహన్ రెడ్డి .. ఈ నెల రోజుల్లోనే తీసుకున్నారు. రబీ సీజన్ నుంచే వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు చేయనున్నారు. మామూలుగా అయితే.. ప్రతి ఏడాది మేలో ఇస్తామని ప్రకటించారు. మేలో ఇవ్వాల్సింది.. అక్టోబర్‌లోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది. రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లించనున్నారు. పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. .
4. నవరత్నాలే ఏకైక ఎజెండా..!
ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, తొలి మంత్రివర్గ సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ అదే చెప్పారు. ప్రతి ఒక్క ఉద్యోగి వద్ద.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండాలని… దాని ప్రకారమే… విధులు నిర్వహించాలని.. స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజలు.. నవరత్నాలను… చూసి అధికారం ఇచ్చారని.. ఆ నవరత్నాలను వారి వద్దకు చేర్చాల్సిన బాధ్యత ఉందని… జగన్ నమ్ముతున్నారు. అధికారులకూ అదే చెప్పారు.
5. యంత్రాంగంపై పట్టు
పాలనలో అనుభవం లేదన్న విమర్శలను.. తిప్పికొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ముందు నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులను ఎక్కడిక్కడ బదిలీ చేసేశారు. లూప్లైన్లో ఉన్న అధికారులకు కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. రెండు రోజుల పాటు.. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పెట్టి… తాను ఏం కోరుకుంటున్నదీ స్పష్టంగా చెప్పారు. అధికారులు కూడా.. ప్రభుత్వ అధినేత ఆలోచనలు అర్థం చేసుకున్నారు. దాని ప్రకారమే.. తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.
6. పొరుగు రాష్ట్రంతో సన్నిహిత సంబంధాలు
పొరుగు రాష్ట్రంలో ఉన్న వివాదాలను… ఎక్కడికక్కడ మర్చిపోయి.. విభజన సమస్యల పరిష్కారానికి జగన్ ప్రయత్నాలు ఈ నెలలోనే చురుకుగా సాగాయి. తెలంగాణతో నెల రోజుల్లోనే సోదర సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ లోని ఏపీ భవనాలన్నింటినీ తెలంగాణకు ఇచ్చారు. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లొచ్చారు. ఉమ్మడి సంస్థలు, కరెంట్ బకాయిలు, ఉద్యోగుల విభజన గురించి… అధికారుల స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. త్వరలో వీటికి పరిష్కారం లభించే అవకాశం ఉంది.
7. జలయజ్ఞానికి కొత్త రూపు..!
పొరుగు రాష్ట్రంతో ఏర్పడిన సానుకూల భావనతో.. గోదావరి నీటిని.. శ్రీశైలంకు తరలించే మహత్తర ప్రాజెక్ట్‌పై… తెలంగాణ సీఎంతో ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించారు. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలిస్తే.. అక్కడి నుంచి సమృద్ధిగా సీమకు నీళ్లు తరలించవచ్చని… తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన సలహా .. జగన్ ను అమితంగా ఆకర్షించింది. జలవనరుల నిపుణులు జూలై పదిహేను కల్లా నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నది. ఈ ప్రాజెక్ట్ సాకారం అయితే.. కరువు అనేది ఏపీలో ఉండదు. ఈ దిశగా జగన్ నెలలోనే అడుగులు వేశారు.
8. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం..!
అధికారం చేపట్టిన మొదటి నెల రోజుల్లో… జగన్మోహన్ రెడ్డి వేసిన తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి అక్రమ నిర్మాణాల కూల్చివేత. మొదట.. ప్రభుత్వ ఆస్తి అయిన… ప్రజావేదికతోనే… ప్రారంభించారు. కలెక్టర్ల సమావేశం … అదే ప్రజావేదికలో పెట్టి… సమావేశం ముగిసిన రోజు నుంచే కూల్చివేత ప్రారంభించారు. కరకట్ట మీద ఉన్న ఇళ్లనూ కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. ఇలా కరకట్టలు,కాల్వగట్ల మీద ఉన్న ఆక్రమణలపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సహజంగానే వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న అభిప్రాయాన్ని మాత్రం… ప్రభుత్వ పెద్దలు కల్పిస్తున్నారు.
9. గత ప్రభుత్వ నిర్ణయాలపై కారణాలు లేకుండా సమీక్షలు..!
గత ప్రభుత్వం కచ్చితంగా అవినీతికి పాల్పడిందని.. నిరూపించాలన్న పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. నెల రోజుల్లో జగన్ చేసిన సమీక్షలు ప్రధానంగా.. నిర్ణయాలను.. సమీక్షించి.. అందులో తేడాలున్నాయని చెప్పడానికే కానీ.. ముందుకు తీసుకెళ్లే విధంగా లేవు. కరెంట్ కొనుగోళ్లలో.. రూ. రెండువేల ఆరు వందల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఏకపక్షంగా ప్రకటించేశారు. దానికి సంబంధించి అధికారులు.. ఏమన్నారో.. ఎవరు నివేదిక ఇచ్చారో స్పష్టతలేదు. కానీ ఏకంగా అప్పటి సీఎంపైనే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించేశారు. దీంతో.. కేవలం కక్ష పూరితంగానే.. జగన్ సమీక్షలు జరుగుతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది.
10. ప్రజాసమస్యల పరిష్కారానికి దొరకని సమయం..!
ప్రజలకు సంబంధించిన కొన్ని కొన్ని మౌలిక సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరించలేదన్న విమర్శలు మాత్రం వచ్చాయి. ప్రభుత్వం మారగానే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు ధర్నాలు చేశారు. దీనిపై.. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు లాంటి వాళ్లు.. కరెంట్ ఉంది కానీ.. దృష్టి పెడితే చాలని వ్యాఖ్యానించారు. రైతులకు విత్తనాలు అందలేదు. అనంతపురం జిల్లాలో విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్నారు. ధర్నాలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి డబ్బులు అందక రైతులు కూడా కొన్ని చోట్ల ధర్నాలు చేశారు. అదే సమయంలో.. అభివృద్ధి పనులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అమరావతిపై సరైన విధానం ప్రకటించకపోయేసరికి.. భూములిచ్చినరైతులు ఆందోళన చెందుతున్నారు.
రేటింగ్ : 8 / 10
అంతిమంగా.. సర్కార్ పనితీరుపై.. నెల రోజుల్లోనే అంచనాకు రావడం కష్టం. కానీ పాలనా తీరు ఎలా ఉండబోతోందో మాత్రం అంచనాకు రావచ్చు. దాని ప్రకారం… నెల రోజుల జగన్ పాలనకు… పదికి ఎనిమిది మార్కులు ఇవ్వొచ్చు.