ఎర్రకోట పై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో రాజకీయ వారసత్వాన్ని.. అవినీతిని అంతమొందిస్తానని మీ ఆశీర్వాదం కావాలని ప్రజలను కోరారు. అయితే రాజకీయ వారసత్వం సంగతేమో కానీ అవినీతి అంశంపై మాత్రం రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదో సారి జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి మోదీ. మొదటి సారి జెండా ఎగురవేయడానికి.. ఇప్పుడు జెండా ఎగురవేయడానికి మధ్య ఉన్న కాలంలో అవినీతి అంతానికి ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాల్సి ఉంది.
నిజానికి కేంద్రం చేస్తున్న అవినీతి పోరాటం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఎనిమిదేళ్లుగా త్రివిధ దళాల పేరుతో సీబీఐ, ఐటీ, ఈడీలతో విపక్ష నేతలపై దాడులు చేయించి.. వారితో పార్టీలు మార్పించి.. ప్రభుత్వాలను కూలగొట్టడం తప్ప.. నిజంగా అవినీతి పరులపై తీసుకున్న చర్యలేవీ లేవు. కాంగ్రెస్ నుంచి వచ్చిన చేరిన హిమంత బిశ్వశర్మ అనే నేత కేసులను పట్టించుకోకపోవడమే కాదు ఏకంగా సీఎం పదవి కూడా ఇచ్చారు. బీజేపీలో చేరిన ఒక్కరిపైనా కేసులు ముందుకు సాగడం లేదు.
బీజేపీలో చేరకపోయినా పర్వాలేదు.. బీజేపీ సానుభూతిపరులైతే చాలు వాళ్లకు కేసుల నుంచి రక్షణ లభిస్తున్న అంశం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే బీజేపీని వ్యతిరేకించినా… వ్యతిరేకించే పార్టీలో ఉన్నా.. ఆ మూడు దర్యాప్తు సంస్థలకు టార్గెట్ అయినట్లే. ఇది అవినీతిని నిర్మూలించడం అని ఎవరూ అనుకోరు. కానీ ప్రధానమంత్రి మాత్రం .. తాను అదే పనిలో ఉన్నానని చెబుతున్నారు. దేశ ప్రజలకు మాత్రం ఆ మాటల్లో అంత నిజాయితీ కనిపించలేదు. ఎందుకంటే కళ్ల ముందు జరుగుతున్న వ్యవహారాలు ఆ తీరుగానే ఉన్నాయి.