రికార్డుల పిచ్చి పడితే అంతే..! ఎవరూ ఏం చేయలేరు..! వారు చెప్పేది నిజమని నమ్మించేందుకు ఎన్నెన్నో లెక్కలు చెబుతారు. సాధారణంగా సినిమా హీరోల అభిమానులు… హీరోల ప్రాపకం కోసం నిర్మాతలు ఈ ఫేక్ రికార్డులను ప్రకటిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వాలు.. అరుదుగా తాము చేసే పనుల్లో రికార్డుల కోసం ఫేకింగ్ చేస్తూ ఉంటాయి. ఏపీ సర్కార్ ప్రకటించుకున్న ఒకే రోజు 13 లక్షల మెగా వ్యాక్సినేషన్ డేటాను.. కోవిన్ యాప్లో గత వారం రోజుల డేటాను పరిశీలిస్తే.. అలాంటిది ఏదో జరిగిందన్న అనుమానం రాక మానదు.
గత ఐదు రోజుల టీకా డేటాను ఈ రోజు అప్ లోడ్ చేశారా..?
మొత్తంగా 2232 కేంద్రాల్లో దాదాపుగా 13 లక్షల 20 వేల మందికి వ్యాక్సిన్లు వేశామని ఏపీ సర్కార్ ప్రకటించుకుంది. సగటున ఒక్కో కేంద్రంలో ఆరువందల మందికి వ్యాక్సిన్ వేసినట్లు అవుతుంది. ఒక్కొక్కరికి రిజిస్ట్రేషన్ చేయాడనికి .. వ్యాక్సిన్ వేయడానికి కనీసం పావు గంట సమయం పడుతుంది. అంటే గంటకు నలుగురికి మాత్రమే వేయగలుగుతారు. అయినా ఒక్కో సెంటర్లో ఆరు వందల మందికిపైగా వ్యాక్సిన్ వేసినట్లుగా ప్రభుత్వం రికార్డుల ద్వారా తెలిపింది. అంటే నిజంగా ఒక్క రోజే సుమారుగా పదమూడు లక్షల ఇరవై వేల మందికి టీకాలు వేయలేదని సులువుగానే అంచనా వేయవచ్చు. అది గత వారం రోజుల నుంచి వేసిన టీకాల డేటాను అప్ లోడ్ చేయకుండా ఉంచి ఒక్క రోజే మొత్తాన్ని అప్ లోడ్ చేశారు. ఆ విషయం.. గత పది రోజుల ఏపీ వ్యాక్సినేషన్ డేటాను చూస్తే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.
నిజాల్ని బయట పెట్టిన కోవిన్ యాప్..!
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. గత పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వ్యాక్సినేషన్ చాలా పరిమితంగా జరుగుతోంది. ముఖ్యంగా పదిహేనో తేదీ నుంచి అయితే.. అసలు రోజుకు ఇరవై నుంచి ముఫ్పై వేల మందికి కూడా వ్యాక్సిన్ వేసినట్లుగా చూపించలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దాదాపుగా రోజుకు రెండు లక్షల మంది వరకూ వ్యాక్సిన్ డోసులు వేస్తూండగా.. ఏపీలో ఎందుకు కనీసం ఇరవై వేలు కూడా వేయలేకపోయారన్న దానికి సమాధానం ఆదివారం లభించింది. ఆయా రోజుల్లో వేసిన టీకాల సమాచారం మొత్తం అప్ లోడ్ చేయలేదు. అన్నీ కలిపి ఆదివారం అప్ లోడ్ చేసి రికార్డు సృష్టించేశారని సులువుగానే అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సామాన్యుల్లో పలుచనైపోతున్నారు .. కాస్త చూసుకోండి పెద్దలూ..!
టీకాలు వేసే సామర్థ్యం ఉందని చెప్పుకోవడానికో… తమ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని చెప్పుకోవడానికో… ఇలాంటి స్కిట్లను ప్రదర్శించాలన్న సలహాలను ప్రభుత్వ పెద్దలకు ఎవరు ఇస్తున్నారో కానీ.. ఈ టెక్నాలజీ కాలంలో అన్నీ సులువుగానే వెలుగులోకి వస్తున్నాయి. చివరికి సామాన్య ప్రజలు కూడా నమ్మరు. ఎందుకంటే… ఇప్పటికే సోషల్ మీడియాలో తాము నాలుగు రోజుల కిందట టీకా వేయించుకుంటే ఇవాళ మెసెజ్ వచ్చిందంటూ… పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల సామాన్య ప్రజల్లో పోయేది ప్రభుత్వ పరువే. ఒక్క రోజే పదమూడు లక్షల టీకాలు వేసినా… ప్రపంచబ్యాంక్ పరుగెత్తికొచ్చి కొత్త రుణాలు ఏమీ ఇవ్వదు. పొడిగేవారు.. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పెద్దల్ని గిలిగింతలు పెట్టడానికి ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని గుర్తించాల్సి ఉంది.